14, డిసెంబర్ 2024, శనివారం

కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య "మహా సంగ్రామం" (1985) : Krishna, Sobhan babu Last Multi Starrer Telugu Movie "Maha Sangramam"


కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య "మహా సంగ్రామం" (1985) : Krishna, Sobhan babu Last Multi Starrer Telugu Movie "Maha Sangramam"



 తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి తరం  మల్టీ స్టారర్ కాంబినేషన్  మూవీస్ 

కృష్ణ, శోభన్ బాబుల కాంబినేషన్ లో ఎన్నోవిజయవంతమైన  సినిమాలు వచ్చినప్పటికీ 19 85 లో సంయుక్త మూవీస్ బ్యానర్ పై విడుదలైన " మహాసంగ్రామం" వీరిరువురి కాంబినేషన్ లో చివరి సినిమాగా మిగిలిపోయింది. నాటి అగ్ర కథానాయకులు NT రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తరువాత ప్రభావవంతమైన స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది కృష్ణ, శోభన్ బాబులే. ఎన్టీఆర్ తరహాలో రివల్యుషన్, థ్రిల్లర్, యాక్షన్ ప్రధాన చిత్రాలతో మాస్  హీరోగా గుర్తింపు తెచ్చుకుంది కృష్ణ కాగా, ఎ ఎన్నార్ లాగా రొమాన్స్, ఎమోషన్స్, ప్యామిలీ డ్రామా చిత్రాలతో క్లాస్ హీరోగా ఆదరణ పొందారు. సినిమాలు ఎంత  కలెక్షన్స్, ఎన్ని రోజులు, ఎన్ని కేంద్రాలు, ఎన్ని థియేటర్స్ లలో రికార్డ్స్ సృష్టించాయి అన్న విషయంలో ముందుగా ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ అభిమానుల మధ్య పోటీ ఉండేది. 


ఆ తరువాత ఆ పోటీ వాతావరణం కృష్ణ - శోభన్ బాబు అభిమానులకు కూడా అలవడింది. అప్పట్లో అగ్ర కథానాయకులుగా వెలుగొందిన ఎన్ టి ఆర్, ఎ ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లు ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించారు. ఎన్ఎ టి ఆర్ తోనూ, ఎ ఎన్ ఆర్ తోనూ శోభన్ బాబు  చాలా సినిమాలు చేసారు. అలాగే ఎన్ టి ఆర్ తో , ఎ ఎన్ ఆర్ తో  కృష్ణ కూడా చెప్పుకోదగ్గ సినిమాలే చేసారు. ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ ల కంటే శోభన్ బాబు - కృష్ణలు చాలా జూనియర్స్ కాబట్టి వారు కలిసి నటించిన సినిమాలలో సహజంగా ఎన్ టి ఆర్ , ఎ ఎన్ ఆర్ పాత్రలకే ప్రాధాన్యత ఉండేది. 


ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ మల్టీ స్టారర్ మూవీస్ 

ఎన్  టి ఆర్ - ఎ ఎన్ ఆర్ లు తమ తొలినాళ్ళలో  పల్లెటూరి పిల్ల (1950) నుండి... సత్యం శివం ( 19 81) వరకు మూడు దశాబ్దాలలో ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు చేసారు. వీటిలో మిస్సమ్మ, తెనాలిరామకృష్ణ, మాయాబజార్, భూకైలాస్, గుండమ్మకథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. సీనియర్ హీరో అయినప్పటికీ ఎ ఎన్ ఆర్ పల్లెటూరి పిల్ల, మిస్సమ్మ తదితర చిత్రాలలో ఎన్ టి ఆర్ కంటే ప్రాధాన్యత తక్కువ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే కృష్ణ కంటే సీనియర్ అయిన శోభన్ బాబు తొలిరోజుల్లో ఇద్దరూ కలిసి నటించిన సినిమాలలో తక్కువ నిడివి, ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించారు. 


అప్పట్లో వాళ్ళు సినిమాలో తనకు ఇచ్చిన పాత్రకు తగిన న్యాయం చేసామా..లేదా..అన్న కోణం లోనే చూసే వారు తప్ప,  పాత్ర ప్రాధాన్యత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే తమకంటూ ఒక స్టార్ డం, తమకంటూ అభిమాన అనుచరగణం ఏర్పడిందో..అప్పటి నుండి మల్టీ స్టారర్ చిత్రం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి వచ్చేది. సినిమాలో తమ హీరోకి ఏమాత్రం ప్రాధాన్యత తగ్గినా తమ ఉత్తరాల ద్వారా, అభిమాన సంఘాల నాయకుల ద్వారా తమ అసంతృప్తిని, ఆవేదనను ఆ హీరోకి తెలియజేసేవారు. 


కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ క్రేజ్ 

అప్పట్లో ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్ కి ఎంత క్రేజ్ ఉండేదో ఆ తరువాత కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ మూవీస్ కి అంత క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ సినిమాలకు కూడా తొలి రోజుల్లో అంత పట్టింపు ఉండేది కాదు గానీ..తరువాత తరువాత హీరోలుగా ఒక స్థాయి, తమకంటూ భారీ అభిమాన ప్రేక్షక బలం ఏర్పడిన తదుపరి సినిమాలో పాత్రల ప్రాధాన్యత తోపాటుగా, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఆఖరికి ధరించే దుస్తులు కూడా తూకం వేసుకోవాల్సి వచ్చేది. మా హీరోకి ఒక పాట ఎక్కువ అంటే, మా హీరోకి ఒక ఫైట్ ఎక్కువ అని, మా హీరోనే ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ అంటే..మా హీరోదే ఫస్ట్ సాంగ్ అని ఇలా ప్రతి విషయంలో ఎక్కువ తక్కువ వాగ్వివాదాలు జరిగేవి. ఒకప్రక్క మల్టీ స్టారర్ మూవీస్ అంటే మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గరనుండే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండేవారు. ఎక్కడ ఏ కొంచెం తేడా జరిగినా అభిమానులు దుమ్మెత్తిపోస్తారని అటు హీరోలు, ఇటు దర్శక, నిర్మాతలు తెగ కంగారు పడుతుండేవారు. ఈ మల్టీ స్టారర్ మూవీస్ జయాపజయాలతో నిమిత్తం లేకుండా భారీ ఓపెనింగ్స్, తొలి వారం రికార్డ్ కలెక్షన్స్ తెచ్చిపెట్టేవి. 


ఆ ధైర్యంతో నిర్మాతలు మల్టీ స్టారర్ సినిమాల నిర్మాణానికి చాలా ఆసక్తి ప్రదర్శించేవారు. మొదట్లో కృష్ణ - శోభన్ బాబు కాంబినేషన్ సినిమాలలో కూడా తమ పాత్రల ప్రాధాన్యత గురించి పెద్దగా పట్టించుకొనలేదు. ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్ ల తరువాత అగ్ర హీరోలుగా కృష్ణ , శోభన్ బాబులు తమ వ్యక్తిగత ఇమేజ్ లు సాధించడంతోనే ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న సమస్యను తరుచుగా అభిమానులు తెచ్చిపెట్టే వారు. ఎన్ టి ఆర్ తరువాత అంతటి మాస్ చరిష్మా ఉన్న హీరోగా కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్, రొమాన్స్, డ్రామా చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ క్లాస్ హీరోగా శోభన్ బాబు పేరు గడించారు. ఆయన అభిమానుల్లో మహిళా అభిమానులు ఎక్కువ. 


      Also read :   చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం


మహా సంగ్రామం తో ముగింపు 

మాస్ హీరో కావడంతో కృష్ణ కు సినిమాలలో  కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండే వారు. అది మహాసంగ్రామం ( 1985) కు వచ్చేప్పటికి మరింత పెరిగింది. పేరుకి ఇద్దరు హీరోలు అయినప్పటికీ కృష్ణ హీరోయిజాన్ని అమాంతం పెంచేసి, శోభన్ బాబు పాత్ర ను సపోర్టింగ్ క్యారెక్టర్ స్థాయికి కుదించేయడం శోభన్ అభిమానులను వేదనకు గురి చేసింది. ఆ సినిమా పోస్టర్స్, బ్యానర్స్, కటౌట్స్ లో కూడా శోభన్ బాబు కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అప్పట్లో అభిమానులకు తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. అభిమానుల నిరసన సెగలు శోభన్ బాబు కు గట్టిగానే తగిలాయి. తన అభిమానులకు మానసిక వేదన కలిగినందుకు ఎంతో బాధగా ఉన్నదని, ఇకపై మల్టీ స్టారర్ సినిమాలలో నటించనని శోభన్ బాబు బహిరంగ ప్రకటన చేసే వరకు ఇది దారి తీసింది. మహాసంగ్రామం సినిమా  కృష్ణ - శోభన్ బాబు నటనా జోడీకి  ముగింపు పలికింది. 


కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్ 

లక్ష్మి నివాసం (1966), శ్రీ శ్రీ మర్యాద రామన్న (గెస్ట్ అప్పియరెన్స్ ) (1967), మంచిమిత్రులు (1969), విచిత్ర కుటుంబం (1969), మా మంచి అక్కయ్య (1970), పుట్టినిల్లు మెట్టినిల్లు (1973), గంగ మంగ (1973), కురుక్షేత్రం (1977), మండే గుండెలు (1979), కృష్ణార్జునులు (1982), ముందడుగు (1983), ఇద్దరు దొంగలు (1984), మహాసంగ్రామం (1985) 


10, డిసెంబర్ 2024, మంగళవారం

కుర్రాళ్ళోయ్..కుర్రాళ్ళు..వెర్రెక్కి ఉన్నోళ్ళు..(అందమైన అనుభవం 1979 ) : Kurralloy Kurrallu song lyrics - ANDAMAINA ANUBHAVAM - Telugu Movie Top Songs

 చిత్రం : అందమైన అనుభవం (1979)

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


                                     



పల్లవి :

 

కుర్రాళ్ళోయ్ - కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు - కవ్వించే సోగ్గాళ్ళు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు - వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు - కవ్వించే సోగ్గాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు - అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు - ఆవేశం ఉన్నవాళ్ళు రా రా రా రీ..హో ..

 

 కుర్రాళ్ళోయ్ - కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

                                              కళ్ళాలే లేనోళ్ళు - కవ్వించే సోగ్గాళ్ళు   

 

                                                                    చరణం :

 

 గతమును పూడ్చేది వీళ్ళు - చరితను మార్చేది వీళ్ళు

కథలై నిలిచేది వీళ్ళు -  కళలకు పందిళ్ళు వీళ్లు

వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు...

చెలిమికెపుడూ జతగాళ్ళు – చెడుకు ఎపుడు పగవాళ్ళు

వీళ్ళ వయసు నూరేళ్ళు - నూరేళ్ళకు కుర్రాళ్లు

 

ఆటగాళ్ళు పాటగాళ్ళు - అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు -  ఆవేశం ఉన్నవాళ్ళు రా రా రా  రీ.. హో ..

 

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు - వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు -  కవ్వించే సోగ్గాళ్ళు

 

చరణం :

 

 తళతళ మెరిసేటి కళ్ళు - నిగనిగలాడేటి ఒళ్ళు

విసిరే చిరునవ్వు జల్లు - ఎదలో నాటేను ముల్లు

తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు

నిదురరాని పొదరిల్లు - బ్రహ్మచారి పడకిల్లు

మూసివున్న వాకిళ్ళు – తెరచినప్పుడే తిరునాళ్ళు

 

ఆటగాళ్ళు పాటగాళ్ళు - అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా రా  రీ.. హో ..

 

చరణం :

 

 నీతులుచెప్పే ముసలాళ్ళు – నిన్నా  మొన్నటి కుర్రాళ్లు

దులిపెయ్ ఆనాటి బూజులు -  మనవే ముందున్న రోజులు

తెంచేసేయ్ పాతసంకెళ్ళు

 

మనుషులె మన నేస్తాలు -  కమాన్ క్లాప్.. మనసులె మన కోవెల్లు

మనుషులె మన నేస్తాలు - మనసులె మన కోవెల్లు..యెవ్రీబడీ

మనకు మనమే  దేవుళ్ళు -  మార్చిరాయి శాస్త్రాలు

 

ఆటగాళ్ళు పాటగాళ్ళు - అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు - ఆవేశం ఉన్నవాళ్ళు రా రారా రీ.. హో ..

 

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు - వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు - కవ్వించే సోగ్గాళ్ళు ..

కమాన్ యెవ్రీబడీ జాయిన్ టుగెదర్.. 


6, డిసెంబర్ 2024, శుక్రవారం

భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ గా మార్చేసిన "మంగమ్మ గారి మనవడు" (1984) : Bhargav Arts bonding with Nandamuri Balakrishna (NBK)

 

భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ గా మార్చేసిన "మంగమ్మ గారి మనవడు" (1984)  : Bhargav Arts bonding with Nandamuri Balakrishna (NBK)




విడుదల : 7 సెప్టెంబర్ 1984

నటవర్గం : బాలకృష్ణ, భానుమతి రామకృష్ణ , సుహాసిని, గొల్లపూడి మారుతీరావు, గోకిన, వై విజయ, బాలాజీ..

దర్శకత్వం : కోడి రామకృష్ణ 

నిర్మాత : ఎస్ గోపాల్ రెడ్డి 

సంగీతం : కె వి మహదేవన్ 

నిర్మాణ సంస్థ : భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ 


                                      1974 లో తండ్రి ఎన్ టి రామారావు దర్శకత్వంలో తెరకెక్కించిన  "తాతమ్మ  కల" చిత్రం ద్వారా బాల నటుడిగా  సినీ రంగ ప్రవేశం చేసారు నందమూరి బాలకృష్ణ. ఆ తరువాత తండ్రి ఎన్ టి ఆర్ తో కలసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమ కవి, దానవీర శుర కర్ణ, శ్రీ మద్విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాలలో నటించారు. ఎన్ టి ఆర్ రాజకీయ రంగ ప్రవేశ అనంతరం 1984 లో  భారతీ వాసు దర్శకత్వం లో  మొదటిసారిగా  సోలో హీరోగా " సాహసమే జీవితం" చిత్రంతో బాలకృష్ణ రీ ఎంట్రీ ఇచ్చారు. దీనితోపాటు తరువాత వచ్చిన తాతినేని ప్రసాద్ దర్శకత్వంలోని "డిస్కో కింగ్ " ( హిందీ డిస్కో డాన్సర్ కు రీమేక్ ) , కె విశ్వనాథ్ దర్శకత్వంలోని " జననీ జన్మభూమి" చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందలేక పోవడంతో నందమూరి అభిమానులు కొంచెం  నిరాశ చెందారు. 


                                   ఆ సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాతగా.. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, సుహాసిని జంటగా సీనియర్ నటీమణి భానుమతి రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన "మంగమ్మ గారి మనవడు" సంచలన విజయం సాధించి సరికొత్త రికార్డ్ లను నెలకొల్పింది. 25 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని బాలకృష్ణ కు తొలి సోలో హీరో శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. శ్లాబ్ సిస్టం వచ్చిన తరువాత హైదరాబాద్ లో 565 రోజులు ప్రదర్శించబడిన సినిమాగా చరిత్ర లిఖించింది. ఎన్ టి ఆర్ ఘన వారసత్వాన్ని కొనసాగించే సత్తా ఉన్న వారసుడిగా బాలకృష్ణ నిరూపించుకోవడమే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా స్థానాన్ని పదిలం చేసింది. 


                                 "బాలకృష్ణ - భార్గవ్ ఆర్ట్స్" మధ్య ఒక ఆత్మీయ బంధానికి పునాది వేసింది ఈ "మంగమ్మ గారి మనవడు" చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలకు స్వంత చిత్ర నిర్మాణ సంస్థలు ఉండడం సహజం. ఎన్ టి ఆర్, బాలకృష్ణ లకు రామకృష్ణ సినీ స్టూడియోస్, ఎ ఎన్ ఆర్, నాగార్జునలకు అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణకు పద్మాలయా స్టూడియోస్, కృష్ణంరాజు కు గోపీ కృష్ణా మూవీస్,  చిరంజీవి కి గీతా ఆర్ట్స్, వెంకటేష్ కు సురేష్ ప్రొడక్షన్స్ స్వంత నిర్మాణ సంస్థలుగా ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఆయా స్వంత సంస్థల కంటే కొన్ని బయటి సంస్థల్లోనే కొందరు హీరోలు ఎక్కువ సినిమాలు చేయడం, ఎక్కువ హిట్ లు దక్కించుకోవడం, ఎక్కువ అనుబంధం కలిగి ఉండడం జరుగుతుంది. 


                                    భార్గవ్ ఆర్ట్స్ కు బాలకృష్ణ కు అదే తరహా అనుబంధం ఉంటుంది. బాలకృష్ణ తో మంగమ్మ గారి మనవడు (1984), ముద్దుల కృష్ణయ్య  (1986), మువ్వగోపాలుడు (1987), ముద్దుల మావయ్య (1989), ముద్దుల మేనల్లుడు ( 1990 ), మాతో పెట్టుకోకు (1995) చిత్రాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. ఇందులో మువ్వ గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య లు శతదినోత్సవ చిత్రాలు కాగా, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్యలు ఇండస్ట్రీ హిట్ లు. ముద్దులమేనల్లుడు, మాతో పెట్టుకోకు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేదు. భార్గవ్ ఆర్ట్స్ లో మరే హీరో ఇన్ని చిత్రాలు చెయ్యలేదు. ఒక్క నాగార్జునతో "మురళీకృష్ణుడు" (1988) తప్పించి మరే అగ్ర హీరోతోనూ సినిమాలు చేయలేదు. సుమన్, భానుచందర్, అర్జున్, రాజశేఖర్, సురేష్, వడ్డే నవీన్ లతో చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించారు. 


                                   గ్రామీణ కథానాయకుడు పాత్రలో బాలకృష్ణ కు ఇంకెవరూ సాటి రారు అన్న ప్రశంసలను భార్గవ్ ఆర్ట్స్ అందించింది. మంగమ్మ గారి మనవడు నుండి ముద్దుల మేనల్లుడు వరకు ఐదు చిత్రాలలో ఒక విశేషం ఉంది. ఒక గొప్ప  కాంబినేషన్ కొనసాగుతూ వచ్చింది. ప్రొడక్షన్ - భార్గవ్ ఆర్ట్స్, హీరో - బాలకృష్ణ, దర్శకుడు - కోడి రామకృష్ణ, సంగీతం - కె వి మహదేవన్, నిర్మాత - ఎస్ గోపాల్ రెడ్డి. ఈ సినిమాల పేర్లు అన్నీ "మ" అక్షరంతో మొదలవుతాయి. ఏవో రెండు, మూడు సినిమాలు తప్ప భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ "మ" అక్షరం, దర్శకుడు కోడి రామకృష్ణ  సెంటిమెంట్ నే పాటించాయి. బాలకృష్ణ తో చివరి చిత్రం "మాతో పెట్టుకోకు" కు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, సంగీతం మాధవపెద్ది సురేష్. 


                                  "మంగమ్మగారి మనవడు" మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్. దీనిలోని "దంచవే మేనత్త కూతురా " సాంగ్ ఇప్పటకీ రీమిక్స్, డిజే స్టైల్స్ తో ఉర్రూతలూగిస్తునే ఉంది. "వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త "... "గుమ్మచూపు నిమ్మ ముల్లు" పాటలు ఎంతగానో అలరించాయి. చాన్నాళ్ళ తరువాత ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటి మంగమ్మ పాత్రకు ప్రాణం పోయడంతోపాటు "శ్రీ సూర్య నారాయణ మేలుకో" పాటను ఆలపించారు. ఈ చిత్ర ఘన విజయంతో ఆమె మరెన్నో సినిమాలలో తన నటన కొనసాగించారు. "చందురూడు నిన్ను చూసి చేతులెత్తాడు" పాటలో రాముడు, కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రలను పోషించి తండ్రికి తగ్గ తనయుడిగా  అభిమానులను మెప్పించడమే కాకుండా భవిష్యత్ లో అటువంటి పాత్రలకు తానే సరిసాటి అని బాలకృష్ణ నిరూపించారు. మొత్తంగా మంగమ్మ గారి మనవడు "భార్గవ్ ఆర్ట్స్ - బాలకృష్ణ" లకే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకే ఒక గొప్ప విజయంగా నిలిచింది. 

5, డిసెంబర్ 2024, గురువారం

ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ "పుష్ప - 2" రిలీజ్ మేనియా : pushpa 2 movie worldwide release


ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ "పుష్ప - 2" రిలీజ్  మేనియా :  pushpa 2 movie worldwide release


                                   "పుష్ప" తో మరో తెలుగు  పాన్ ఇండియా స్టార్ హీరో గా ఎదిగిన  అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలు జంటగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన " పుష్ప - 2" ( తెలుగు, హిందీ ) నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 వేల థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి సందడి చేస్తుంది. తొలుతగా వస్తున్న రివ్యూలు, సోషల్ మీడియా స్పందనలు ప్రకారం మరో తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్నో వివాదాలు, అవరోధాలను అధిగమించి విడుదలైన పుష్ప సరికొత్త రికార్డ్స్ సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో అల్లు అర్జున్ యాక్షన్, డ్యాన్ పెర్ఫామెన్స్ హైలెట్ అంటున్నారు. ఒక సీన్ ను మించి ఇంకొక సీన్ చిత్రీకరణతో అభిమానులకు కన్నుల పండుగ చేసారని రివ్యూలు చెప్తున్నాయి.  


                                    ఇప్పటి వరకూ ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్, కల్కి చిత్రాల ఘన విజయాలతో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటగా..ఆర్ ఆర్ ఆర్ తో రామ్ చరణ్, ఆర్ ఆర్ ఆర్, దేవర ఘన విజయాలతో ఎన్ టి ఆర్ పాన్ ఇండియా స్టార్స్ హోదాలను దక్కించుకున్నారు. పుష్ప ను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి సిద్దపడినప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ లు మితిమీరిన ఆత్మవిశ్వాసం, సాహసం చేస్తున్నారని తెలుగు చిత్ర పరిశ్రమ నుండి గట్టిగానే వ్యంగ్య పూరిత వ్యాఖ్యలు, విమర్శలు వినిపించాయి. అల్లు అర్జున్ మార్కెట్ ను పెంచుకోవడానికి ఇది అల్లు అరవింద్ గుడ్డిగా అమలు చేస్తున్న స్ట్రాటజీ అని కూడా  అన్నారు. 


                                     అందుకు తగ్గట్టుగానే పుష్ప విడుదలైన రోజు డివైడ్ టాక్ రావడంతో "ముందే నేను చెప్పలా" తరహ బ్యాచ్ లు, కొంత మంది సినీ విశ్లేషకులు, అనుభవజ్ఞులు  కొంత సంతృప్తి పడిన విషయం వాస్తవం. నెమ్మది నెమ్మదిగా "పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా..ఫైర్" డైలాగ్ లెక్క తెలుగు, అంతకు మించి హిందీ మార్కెట్ లో కుమ్మేసింది. తెలుగు చిత్ర సీమ నుండి మరో పాన్ ఇండియా స్టార్ ని పరిచయం చేసింది. తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి తెలియ చెప్పింది. మన దేశ ప్రముఖ క్రీడాకారులతో పాటుగా, అంతర్జాతీయ క్రీడా కారులు, సెలబ్రిటీలు పుష్ప మేనరిజం ను అనుకరించి విశ్వవ్యాప్త ప్రచారాన్ని ఇచ్చారు.  అలాగే తొలిసారిగా తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కూడా పుష్ప  దక్కించింది. 


                                         ఈ పుష్ప- 2 విడుదల కూడా అంత ఆశాజనక వాతావరణంలో జరుగలేదు. గత ఆంద్రప్రదేశ్ ఎన్నికలలో అల్లు అర్జున్ తన మిత్రుడు, వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవి కి మద్దతుగా నంద్యాలకు వెళ్ళడం... అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మెగా, అల్లు అభిమానుల మధ్య దూరాన్ని మరింత   పెంచింది. ఇంతలో నాగబాబు ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చేవాడు మావాడైనా పరాయివాడే అన్న విధంగా ట్వీట్ పోస్ట్ చేయడం, ఆ తరువాత డిలేట్ చేయడం కూడా ఈ వివాదాన్ని మరింత రాజేసింది. ఇటీవల ఒక సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమాల తీరుపై చేసిన  వ్యాఖ్యలు కూడా ఎవరికి తగిన రీతిగా వారు అన్వయించుకొని ఈ విభేదాలు తారాస్థాయికి చేర్చారు. అసలు వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియా పరంగా ఇరు అభిమానుల మధ్య పెద్ద యుద్దమే నడిచింది. పుష్ప - 2 టికెట్ రేట్లు భారీగా పెంచారన్న మరో వివాదం రేగింది. 


                                                 సినిమా టికెట్ రెట్ల పెంపు, ప్రీనియర్ షోలకు  ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడం, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అల్లు అర్జున్ ట్వీట్ వేయడం విడుదలకు ముందు వాతావరణాన్నిప్రశాంతపరిచింది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించి ధన్యవాదాలు తెలుపడం మెగా అభిమానులను శాంతపరిచింది. విడుదలైన అన్ని చోట్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో పుష్ప - 2 రికార్డ్ ల మాస్ జాతరకు  ఏది ఏమైనా మన తెలుగు సినిమా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మన ఖ్యాతిని ఇనుమడింపజేస్తుండడం తెలుగు సినీ ప్రేక్షకులుగా మనకు ఎంతో గర్వ కారణం.

3, డిసెంబర్ 2024, మంగళవారం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. అంతులేని కథ (1976) పాట : Devude ichadu veedhi okati song lyrics - Superstar Rajanikanth - K J Yesudas telugu songs

 

చిత్రం : అంతులేని కథ (1976)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : కె జే  ఏసుదాసు


                                          


 

పల్లవి :

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..               

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

ఇక ఊరేల - సొంత ఇల్లేల

ఇక ఊరేల - సొంత ఇల్లేల ఓ చెల్లెలా..

ఏల ఈ స్వార్ధం - ఏది పరమార్ధం

ఏల ఈ స్వార్ధం - ఏది పరమార్ధం

చరణం :

నన్నడిగి తలిదండ్రి కన్నారా..

నన్నడిగి తలిదండ్రి కన్నారా

నా పిల్లలే నన్నడిగి పుట్టారా..

 

పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా

నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా

ఏది నీది - ఏది నాది

ఈ భేదాలు.. ఉత్త వాదాలె ఓ చెల్లెలా..

ఏల ఈ స్వార్ధం - ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

 

చరణం :

శిలలేని గుడికేల నైవేద్యం..

ఈ కలలోని సిరికేల నీ సంబరం

ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మా..

కళ్ళులేని కభోది చేతి దీపం నీవమ్మా

తొలుత ఇల్లు.. తుదకు మన్ను

ఈ బ్రతుకెంత.. దాని విలువెంత ఓ చెల్లెలా..

ఏల ఈ స్వార్ధం - ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

 

చరణం :

 

తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం

అది తెలియకపోతేనే వేదాంతం

మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా..

నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా..

ఏది సత్యం - ఏది నిత్యం

ఈ మమకారం - ఒట్టి అహంకారం ఓ చెల్లెలా..

 

ఏల ఈ స్వార్ధం - ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి


పల్లవించవా నాగొంతులో..(కోకిలమ్మ) తెలుగు సినీ మధుర గీతాలు : pallavinchava naa gonthulo song ( Kokilamma ) Telugu Movie Melodies 

 

 

1, డిసెంబర్ 2024, ఆదివారం

చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం : "Khaidi" A milestone movie for Megastar Chiranjeevi

 


చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం : "Khaidi" A milestone movie for Megastar Chiranjeevi




విడుదల : 28 అక్టోబర్ 1983

నటవర్గం : చిరంజీవి, మాధవి, సుమలత, రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి, రంగనాథ్, చలపతిరావు, సంగీత, సంయుక్త, సుత్తివేలు మొ,,

దర్శకత్వం : ఎ కోదండరామిరెడ్డి

నిర్మాతలు : ధనుంజయ రెడ్డి, నరసారెడ్డి, సుధాకర్ రెడ్డి 

సంగీతం : చక్రవర్తి 

నిర్మాణ సంస్థ : సంయుక్త మూవీస్ 


                              1978 లో పునాదిరాళ్ళు సినిమా తో చిరంజీవి సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ మొదట విడుదలైన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులు తెలుగు సినీ పరిశ్రమను ప్రభలంగా  ఏలుతున్న సమయంలో... ఎవరి అండ లేకుండా తన నటన ప్రతిభ, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న చిరంజీవికి ఖైదీ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. 


                                  అప్పటికే 60 కి పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ అప్పియరెన్స్ గా నటించిన చిరంజీవి నట జీవితాన్ని ఖైదీ చిత్రం మాత్రం ఒక గొప్ప మలుపు తిప్పింది. మొగుడు కావాలి, న్యాయం కావాలి,  చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, అభిలాష, మగ మహారాజు వంటి శతదినోత్సవ చిత్రాలు ఉన్నప్పటికీ ఖైదీ మాత్రం తెలుగు చిత్ర సీమలో చిరంజీవికి అగ్ర హీరోగా ఒక స్థానాన్ని సుస్థిరం చేయడానికి దోహదం చేసింది అని ఘంటాపథంగా చెప్పొచ్చు. 


                                  తెలుగు సినీ రంగంలో బిగ్గెస్ట్ మాస్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్న ఎన్ టి రామారావు రాజకీయ ప్రవేశం చేసి, తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి కావడంతో..ఆయన గైర్హాజరీలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రభావవంత స్థానం ఖాళీ అయ్యి కొద్ది నైరాశ్యంలో ఉంది. ఆ సంధి సమయంలో ఒక గొప్ప శకానికి నాంది పడింది. ఉరకలు వేస్తున్న యువ రక్తం..చలాకీ నటన, నాట్యంతో..వచ్చినది ఏపాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేస్తూ..సినిమాల మీద సినిమాల అవకాశం దక్కించుకుంటూ ప్రేక్షకులు తనపై ప్రత్యేక దృష్టి సారించేలా పయనం సాగిస్తున్నారు చిరంజీవి. 


                                  కొన్ని శతదినోత్సవ చిత్రాలతోపాటుగా శుభలేఖ చిత్రానికి బెస్ట్ ఆక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకొని తానేంటో నిరూపించుకున్నారు.   నెల్లూరు కి చెందిన నూతన నిర్మాతలు సంయుక్త మూవీస్ నిర్మాణ సంస్థ తొలి చిత్రం తమ నెల్లూరు కే చెందిన దర్శకుడు ఎ కోదండరామిరెడ్డి తో తీయడానికి సిద్దం అయ్యారు. కోదండరామిరెడ్డి అప్పటికే చిరంజీవితో న్యాయంకావాలి, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్ళు, అభిలాష, శివుడు శివుడు శివుడు తదితర సినిమాలు చేసి  ఉండడం,  అందులోనూ నెల్లూరు అనుబంధం చిరంజీవిని హీరోగా తీసుకోవడానికి తోడ్పడింది. 


                                     సిల్వెస్టర్ స్టాలోన్ హాలీవుడ్  మూవీ ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో హీరో గెటప్ కు రూపకల్పన చేసారు. చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్ ఆరోజుల్ల్లో ఒక ట్రెండ్ సెట్టర్. భూస్వామి ఆగడాలను ఎదిరించే కథానాయకుడు సూర్యం పాత్రలో చిరంజీవి శిఖరాగ్ర నటనతో ప్రేక్షకుల నీరాజనాలు అందుకోవడమే కాకుండా..అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. భావోద్వేగ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలులో చిరంజీవి నటన హై రేంజ్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఫైట్. ఇప్పటికీ సినిమాల్లో పోలీస్ స్టేషన్ ఫైట్ సన్నివేశం అంటే ఖైదీ పోలీస్ స్టేషన్ ఫైట్ తోనే బెంచ్ మార్క్ కంపేరిజన్ చేస్తుంటారు. 


                                        సినిమాలో పాటలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి. " రగులుతోంది మొగలి పొద " పాట అయితే చిరంజీవి  టాప్ సాంగ్స్ లో ఒకటి. ఈ ఖైదీ ఘన విజయం తరువాత చిరంజీవి - కోదండరామిరెడ్డి ల కాంబినేషన్ లో  గుండా , ఛాలెంజ్, దొంగ, విజేత, రాక్షసుడు, దొంగమొగుడు, పసివాడిప్రాణం, జేబుదొంగ, మరణ మృదంగం , త్రినేత్రుడు, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు, కొండవీటిదొంగ, ముఠామేస్త్రి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. చిరంజీవి సినిమాలలో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన ఖ్యాతి ఎ కోదండరామిరెడ్డికి దక్కింది. మెగాస్టార్ చిరంజీవిగా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి ఖైదీ ఒక  గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది.

29, నవంబర్ 2024, శుక్రవారం

తాళికట్టు శుభవేళ ..అంతులేని కథ ..ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గంధర్వ గాన విశ్వరూపం : Thali kattu subhavela song Lyrics - anthuleni katha - S. P. Balasubrahmanyam hit songs

చిత్రం : అంతులేని కథ (1976)

గానం : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం :ఆత్రేయ

సంగీతం : ఎం ఎస్ విశ్వనాథన్








పల్లవి:

తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల

వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను
కాకులు దూరని కారడవి
అందులో.. కాలం యెరుగని మానొకటి..
ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో..

చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా


తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో

చరణం 1:

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా
Singapore airlines announces the arrival of flight S2583

ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా
సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా


తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల

చరణం 2:

గోమాత లేగతో కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా
Wish you both a happy life… happy
 happy married life

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల

చరణం 3:

చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల



కోకిలమ్మ : పల్లవించవా నాగొంతులో..పల్లవి కావా నా పాటలో........