Sobhan babu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sobhan babu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2025, మంగళవారం

శోభన్ బాబు (Sobhan Babu) : వెండితెర వేల్పు, మహిళా ప్రేక్షకుల కలల కథానాయకుడు

 

                                               
శోభన్ బాబు (Sobhan Babu)

తెలుగు సినీ హీరోలలో అందగాడు అనగానే ముందుగా గుర్తొచ్చేది  శోభన్ బాబు ( Sobhan Babu) 


తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన హీరోలలో శోభన్ బాబు ( Sobhan Babu ) ఒకరు. ఆయన అందం, అభినయం, ఆహార్యం.. అన్నీ కలగలిపి ఒక ప్రత్యేకమైన శోభన్ బాబు బ్రాండ్‌ ఇమేజ్ ను  సృష్టించాయి. తెలుగు సినిమా తొలితరం ప్రభావవంతం అయిన అగ్ర కథానాయకులలో ఒకరిగా ఆయన వెలుగొందారు. ఆయన తెరపై కనిపించారంటే చాలు, ప్రేక్షకులు పరవశించిపోయేవారు. 

ఒక తరం ప్రేక్షకులు  మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల కథానాయకుడు..నవలా నాయకుడు..  శోభన్ బాబు. అప్పట్లో  శోభన్ బాబు మహిళా అభిమాని లేని తెలుగు సినీ ప్రేక్షక కుటుంబం లేదంటే అతిశయోక్తి కాబోదు. అటువంటి అతివల హృదయ విజేత శోభన్ బాబు  గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం.

గ్లామర్ హీరో కి అసలైన బ్రాండ్ నేం  శోభన్ బాబు 

శోభన్ బాబు అంటేనే అందం. ఆయన కళ్ళు, ముక్కు, చిరునవ్వు.. అన్నీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉండేవి. ఆయన తెరపై కనిపిస్తే చాలు, ప్రేక్షకులు మైమరచిపోయేవారు. ఆయన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. "అందగాడు అంటే శోభన్ బాబు లాగా ఉండాలి" అని అనేవారు. ఇన్ షర్ట్  డ్రెస్సింగ్ స్టైల్, వంకీ తిరిగిన హెయిర్ స్టైల్ తో అప్పట్లో గ్లామర్ హీరో కి ఒక ట్రెండ్ సెట్ చేసిన నేచురల్ హీరో. 

ఇద్దరు  హీరోయిన్ల ముద్దుల హీరో సినిమాలకు కూడా ఆయనే ట్రెండ్ సెట్టర్. మగవాళ్ళు   కొంచెం స్టైల్ గా తయారైతే " ఏరోయ్..శోభన్ బాబులా రెడీ అయిపోయావ్..ఏమిటి సంగతి..?" అని సెటైర్ లు వేసే వాళ్ళు. ఒక విధమైన వేగంతో, రొమాంటిక్ డైలాగ్ డెలివరి తో మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల కథానాయకుడు. 


చదువుకునే రోజుల నుండే నటనపై ఆసక్తి 

1937 జనవరి 14  న కృష్ణా జిల్లా చిన నందిగామ లోని సామాన్య రైతు కుటుంబంలో శోభన్ బాబు జన్మించారు. అసలు పేరు ఉప్పు శోభనాచలపతిరావు. మైలవరంలో హైస్కులు చదివే రోజుల్లోనే నటనపై ఆసక్తితో ఎన్నో నాటక ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఈ అభిరుచి గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కాలేజీలో డిగ్రీ చదివేనాటికి మరింతగా విస్తృతమైంది.

 తదనంతరం మద్రాసు లో లా విద్య అభ్యసిస్తూనే మరోపక్క నటనపై మక్కువతో సినిమా అవకాశాల కోసం స్టూడియోలు, నిర్మాణ సంస్థల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అవిశ్రాంత పరిశ్రమ చేసేవారు. అప్పటికే శాంతకుమారి తో వివాహం జరిగింది. 


విభిన్న పాత్రల్లో మెప్పించిన నటుడు

ఎన్నో ప్రయత్నాల అనంతరం 'భక్త శబరి' చిత్రంలో తొలిగా అవకాశం వచ్చినప్పటికీ ముందుగా విడుదల అయిన చిత్రం మాత్రం  NTR హీరోగా నటించిన 'దైవబలం' ( 1959). ఇందులో ముని కుమారుడు పాత్రలో నటించారు. తనకు వచ్చిన పాత్ర పరిది పెద్దదా, చిన్నదా అన్నది పరిగణన లోనికి తీసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని తానేమిటి అన్నది నిరూపించుకోవడానికి వినియోగించుకున్నారు. 

సినీ ప్రస్థానం తొలినాళ్ళలో అప్పటికే అగ్ర కథానాయకుడు గా నీరాజనాలు అందుకుంటున్న NTR తో అనేక చిత్రాలలో కలిసి నటించే అవకాశం దక్కింది. ఆయనతో కలిసి ఎన్నో విజయవంతమైన పౌరాణిక చిత్రాలలో నటించి పేరు గడించారు. నాటి మరో అగ్ర కథానాయకుడు ANR తో కలిసి చదువుకున్న అమ్మాయిలు (1963), పూలరంగడు (1967),బుద్ధిమంతుడు (1969), కన్నతల్లి (1972) తదితర సాంఘిక చిత్రాలలో గుర్తింపు పొందిన పాత్రలు పోషించారు. 

వీరాభిమన్యు (1965) లో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ  ఆ తరువాత హాస్య నటుడు పద్మనాభం హీరోగా చేసిన పొట్టి ప్లీడర్ (1966), శ్రీ శ్రీ శ్రీ  మర్యాద రామన్న (1967) చిత్రాలలో కూడా తక్కువ ప్రాధాన్యత గల పాత్రలలో నటించారు.  సినీ పరిశ్రమలో ఒక పదిలమైన స్థానం కోసం ఆయన చేసిన అవిరళ కృషికి ఇది నిదర్శనం.  


శోభన్ బాబు కేవలం అందగాడే కాదు, మంచి నటుడు కూడా. ఆయన విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. పౌరాణిక చిత్రాలలో ఆయన రాముడిగా, కృష్ణుడిగా, లక్ష్మణుడిగా, అర్జునుడిగా, అభిమన్యుడుగా ఇలా ఎన్నో పాత్రలలో   జీవించారు.  సీతారామ కళ్యాణం, భీష్మ, మహామంత్రి తిమ్మరుసు, లవకుశ, నర్తనశాల, శ్రీ కృష్ణ పాండవీయం, కృష్ణార్జునులు,  సంపూర్ణ రామాయణం వంటి చిత్రాలు ఆయన నటనా కౌశల్యానికి నిదర్శనం. 

అలాగే మానవుడు దానవుడు, జీవన తరంగాలు, శారద, మైనర్ బాబు, డాక్టర్ బాబు, ఖైదీబాబాయ్, చక్రవాకం,మంచిమనుషులు, బాబు, జీవనజ్యోతి, సోగ్గాడు, మల్లెపువ్వు, కార్తీకదీపం, గోరింటాకు, మోసగాడు, స్వయంవరం, దేవత, ముందడుగు, ఇద్దరు దొంగలు, ఇల్లాలు ప్రియురాలు, దేవాలయం తదితర  సాంఘిక చిత్రాలలో ఆయన తనదైన సహజ  శైలిలో నటించి మెప్పించారు. 

సాంఘిక చిత్రాలలో ఆయన ఒక సాధారణ వ్యక్తిగా, అనురాగ మూర్తి భర్తగా, బాధ్యతగల కొడుకుగా, సోదరుడుగా, ఒక అద్భుత  ప్రేమికుడిగా, ఒక తండ్రిగా ఇలా విలక్షణమైన ఎన్నో పాత్రలకు  జీవం పోసి  ప్రేక్షక హృదయాలలో చెరిగిపోని ముద్ర వేసారు. 


శోభన్ బాబు విలక్షణ వ్యక్తిత్వం

శోభన్ బాబు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆదర్శవంతమైనది. ఆయన భార్య పేరు నిర్మల. వారికి ఒక కుమారుడు, ముగ్గురు  కుమార్తెలు  ఉన్నారు. శోభన్ బాబు ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండేవారు. సినిమా రంగంలో ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. ఆయన సహనానికి, నిరాడంబరతకు ఎందరో అభిమానులు ఉన్నారు. 

ఎంతో ఆకర్షణ, మరెంతో విలాసాలకి ఆలవాలమైన సినీ రంగంలో ఉన్నప్పటికీ ఎంతో క్రమశిక్షణతో, వివాదరహితుడిగా నిలిచారు. అలనాటి అందాల కథానాయకురాలు, ఒకనాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ముడిపెట్టి న పుకార్లు తప్ప మరి ఏ ఆక్షేపణలు, ఆరోపణలు  లేనట్టి వ్యక్తిత్వం. 

కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుచేతనో వారిని సినీ పరిశ్రమకు పూర్తి దూరంగా ఉంచారు. తన తోటి అగ్ర కథానాయకులు NTR, ANR, కృష్ణ లు వారి వారసుల్ని, బంధువులను సినిమా పరిశ్రమ వైపు ప్రోత్సహించినప్పటికీ శోభన్ బాబు మాత్రం తన కుమారుడిని గాని,  ఇతర తన వారిని గాని వెండితెరకు పరిచయం చేయడానికి అసలు ఇష్టపడలేదు. 

తన నటనా వైదుష్యంతో వరించిన  " నట భూషణ "  ( Nata Bhushana) బిరుదుకు సార్ధకత తెచ్చారు. దక్షిణాది ఫిలిం ఫేర్ నాలుగు ఉత్తమ నటుడు అవార్డ్ లు స్వీకరించారు. ఎటువంటి భేషజం లేకుండా తెలుగు హీరోలలో ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలలో నటించిన శోభన్ బాబు "మహాసంగ్రామం " ( 1985) చిత్రం మిగిల్చిన చేదు అనుభవంతో ఆ తరహా చిత్రాలకు స్వస్తి పలికారు. 


Also Read : కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య "మహా సంగ్రామం" (1985) : Krishna, Sobhan babu Last Multi Starrer Telugu Movie "Maha Sangramam"


నాటి సమవుజ్జీలు అయిన కృష్ణ, శోభన్ బాబు లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండడం, శోభన్ బాబు పాత్రను కుదించడం ఆయన అభిమానులను తీవ్రంగా బాధించింది. ఇది చాలా చోట్ల ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలకు సైతం దారి తీసింది. ఈ విషయం శోభన్ బాబు దృష్టికి వచ్చి, ఇకపై మల్టీ స్టారర్ సినిమాలలో నటించను అని ఆయన పత్రికా ముఖంగా ప్రకటించే వరకు వచ్చింది. 

ఆ మాటకు అనుగుణంగానే నట జీవితం మలి దశలో కూడా సర్పయాగం, బలరామకృష్ణులు, ఏవండీ ఆవిడ వచ్చింది, జీవిత ఖైదీ, ఆస్తిమూరెడు  ఆశ బారెడు, దొరబాబు, అడవిదొర తదితర చిత్రాలలో హీరో,  ప్రధాన పాత్రలలో నటించారు.  ఆఖరి చిత్రం "హలో గురు" ( 1996) లో హీరోగానే నటించి తన సుదీర్ఘ నట జీవితానికి తెర దించారు. 


అత్యంత స్నేహశీలి, స్ఫూర్తి ప్రదాత

శోభన్ బాబు స్నేహానికి ఎంతో విలువ, ప్రాధాన్యత ఇచ్చేవారు. కె వి చలం, మురళీమోహన్, చంద్రమోహన్ లకు ఆప్త మిత్రులు. కష్టపడి స్వయంగా ఎదిగిన నేపథ్యం కావడం వలన ఆయన ఎంతో ఆర్ధిక క్రమశిక్షణ కలిగి ఉండేవారు. అదే  తన మిత్రులకు, పరిచయస్తులకు సూచనలు, సలహాలుగా  ఇచ్చేవారు. వచ్చే సంపాదనలో ఎంతో కొంత భూమి కొనుగోలు కు కేటాయించాలని, రేపు అదే భవిష్యత్ కు భరోసాగా ఉంటుందని గట్టిగా చెప్పేవారు. 

జయభేరి ఆర్ట్స్, జయభేరి రియల్ ఎస్టేట్ తోపాటుగా మరిన్ని వ్యాపార సంస్థల అధిపతి అయిన సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీమోహన్ తన ఉన్నతికి శోభన్ బాబు ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణం అని ఎన్నో సందర్భాలలో చెప్పారు. 


శోభన్ బాబు మరణం

శోభన్ బాబు మరణం తెలుగు సినిమాకు తీరని లోటు. ఆయన 2008 మార్చి 21న గుండెపోటుతో మద్రాసు లోని తన స్వగృహంలో  మరణించారు. ఆయన లేకపోవడం నిజంగా బాధాకరం. అశేష తెలుగు మహిళా ప్రేక్షకులను శోకసముద్రంలో ముంచి ఆయన తన జీవన ప్రస్థానాన్ని ముగించారు.  కానీ, ఆయన తను చేసిన  సినిమాల ద్వారా, ఆయన పోషించిన విభిన్న  పాత్రల ద్వారా ఎప్పటికీ మన హృదయాలలో జీవించే ఉంటారు.


శోభన్ బాబు జ్ఞాపకాలు

శోభన్ బాబు గురించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన సినిమాలు చూసినప్పుడు, ఆయన పాటలు విన్నప్పుడు ఆయన మనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన నటన, ఆయన వ్యక్తిత్వం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ ఉంటాయి.

శోభన్ బాబు ఒక నటుడు మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆయన సినిమాలను చూస్తూ, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుందాం.

ఇవండి నట భూషణ శోభన్ బాబు గురించి కొన్ని విశేషాలు. మీకు కూడా ఆయన గురించి ఏమైనా విశేషాలు తెలిస్తే, కామెంట్స్ లో చెప్పండి. మనం  ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.



చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం


భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ గా మార్చేసిన "మంగమ్మ గారి మనవడు" (1984) 


నాటికీ, నేటికీ కృష్ణ  " సింహాసనం " సినిమా ఒక చరిత్ర 







14, డిసెంబర్ 2024, శనివారం

కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య "మహా సంగ్రామం" (1985) : Krishna, Sobhan babu Last Multi Starrer Telugu Movie "Maha Sangramam"


కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య "మహా సంగ్రామం" (1985) : Krishna, Sobhan babu Last Multi Starrer Telugu Movie "Maha Sangramam"



 తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి తరం  మల్టీ స్టారర్ కాంబినేషన్  మూవీస్ 

కృష్ణ, శోభన్ బాబుల కాంబినేషన్ లో ఎన్నోవిజయవంతమైన  సినిమాలు వచ్చినప్పటికీ 19 85 లో సంయుక్త మూవీస్ బ్యానర్ పై విడుదలైన " మహాసంగ్రామం" వీరిరువురి కాంబినేషన్ లో చివరి సినిమాగా మిగిలిపోయింది. నాటి అగ్ర కథానాయకులు NT రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తరువాత ప్రభావవంతమైన స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది కృష్ణ, శోభన్ బాబులే. ఎన్టీఆర్ తరహాలో రివల్యుషన్, థ్రిల్లర్, యాక్షన్ ప్రధాన చిత్రాలతో మాస్  హీరోగా గుర్తింపు తెచ్చుకుంది కృష్ణ కాగా, ఎ ఎన్నార్ లాగా రొమాన్స్, ఎమోషన్స్, ప్యామిలీ డ్రామా చిత్రాలతో క్లాస్ హీరోగా ఆదరణ పొందారు. సినిమాలు ఎంత  కలెక్షన్స్, ఎన్ని రోజులు, ఎన్ని కేంద్రాలు, ఎన్ని థియేటర్స్ లలో రికార్డ్స్ సృష్టించాయి అన్న విషయంలో ముందుగా ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ అభిమానుల మధ్య పోటీ ఉండేది. 


ఆ తరువాత ఆ పోటీ వాతావరణం కృష్ణ - శోభన్ బాబు అభిమానులకు కూడా అలవడింది. అప్పట్లో అగ్ర కథానాయకులుగా వెలుగొందిన ఎన్ టి ఆర్, ఎ ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లు ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించారు. ఎన్ఎ టి ఆర్ తోనూ, ఎ ఎన్ ఆర్ తోనూ శోభన్ బాబు  చాలా సినిమాలు చేసారు. అలాగే ఎన్ టి ఆర్ తో , ఎ ఎన్ ఆర్ తో  కృష్ణ కూడా చెప్పుకోదగ్గ సినిమాలే చేసారు. ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ ల కంటే శోభన్ బాబు - కృష్ణలు చాలా జూనియర్స్ కాబట్టి వారు కలిసి నటించిన సినిమాలలో సహజంగా ఎన్ టి ఆర్ , ఎ ఎన్ ఆర్ పాత్రలకే ప్రాధాన్యత ఉండేది. 


ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ మల్టీ స్టారర్ మూవీస్ 

ఎన్  టి ఆర్ - ఎ ఎన్ ఆర్ లు తమ తొలినాళ్ళలో  పల్లెటూరి పిల్ల (1950) నుండి... సత్యం శివం ( 19 81) వరకు మూడు దశాబ్దాలలో ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు చేసారు. వీటిలో మిస్సమ్మ, తెనాలిరామకృష్ణ, మాయాబజార్, భూకైలాస్, గుండమ్మకథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. సీనియర్ హీరో అయినప్పటికీ ఎ ఎన్ ఆర్ పల్లెటూరి పిల్ల, మిస్సమ్మ తదితర చిత్రాలలో ఎన్ టి ఆర్ కంటే ప్రాధాన్యత తక్కువ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే కృష్ణ కంటే సీనియర్ అయిన శోభన్ బాబు తొలిరోజుల్లో ఇద్దరూ కలిసి నటించిన సినిమాలలో తక్కువ నిడివి, ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించారు. 


అప్పట్లో వాళ్ళు సినిమాలో తనకు ఇచ్చిన పాత్రకు తగిన న్యాయం చేసామా..లేదా..అన్న కోణం లోనే చూసే వారు తప్ప,  పాత్ర ప్రాధాన్యత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే తమకంటూ ఒక స్టార్ డం, తమకంటూ అభిమాన అనుచరగణం ఏర్పడిందో..అప్పటి నుండి మల్టీ స్టారర్ చిత్రం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి వచ్చేది. సినిమాలో తమ హీరోకి ఏమాత్రం ప్రాధాన్యత తగ్గినా తమ ఉత్తరాల ద్వారా, అభిమాన సంఘాల నాయకుల ద్వారా తమ అసంతృప్తిని, ఆవేదనను ఆ హీరోకి తెలియజేసేవారు. 


కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ క్రేజ్ 

అప్పట్లో ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్ కి ఎంత క్రేజ్ ఉండేదో ఆ తరువాత కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ మూవీస్ కి అంత క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ సినిమాలకు కూడా తొలి రోజుల్లో అంత పట్టింపు ఉండేది కాదు గానీ..తరువాత తరువాత హీరోలుగా ఒక స్థాయి, తమకంటూ భారీ అభిమాన ప్రేక్షక బలం ఏర్పడిన తదుపరి సినిమాలో పాత్రల ప్రాధాన్యత తోపాటుగా, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఆఖరికి ధరించే దుస్తులు కూడా తూకం వేసుకోవాల్సి వచ్చేది. మా హీరోకి ఒక పాట ఎక్కువ అంటే, మా హీరోకి ఒక ఫైట్ ఎక్కువ అని, మా హీరోనే ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ అంటే..మా హీరోదే ఫస్ట్ సాంగ్ అని ఇలా ప్రతి విషయంలో ఎక్కువ తక్కువ వాగ్వివాదాలు జరిగేవి. ఒకప్రక్క మల్టీ స్టారర్ మూవీస్ అంటే మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గరనుండే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండేవారు. ఎక్కడ ఏ కొంచెం తేడా జరిగినా అభిమానులు దుమ్మెత్తిపోస్తారని అటు హీరోలు, ఇటు దర్శక, నిర్మాతలు తెగ కంగారు పడుతుండేవారు. ఈ మల్టీ స్టారర్ మూవీస్ జయాపజయాలతో నిమిత్తం లేకుండా భారీ ఓపెనింగ్స్, తొలి వారం రికార్డ్ కలెక్షన్స్ తెచ్చిపెట్టేవి. 


ఆ ధైర్యంతో నిర్మాతలు మల్టీ స్టారర్ సినిమాల నిర్మాణానికి చాలా ఆసక్తి ప్రదర్శించేవారు. మొదట్లో కృష్ణ - శోభన్ బాబు కాంబినేషన్ సినిమాలలో కూడా తమ పాత్రల ప్రాధాన్యత గురించి పెద్దగా పట్టించుకొనలేదు. ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్ ల తరువాత అగ్ర హీరోలుగా కృష్ణ , శోభన్ బాబులు తమ వ్యక్తిగత ఇమేజ్ లు సాధించడంతోనే ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న సమస్యను తరుచుగా అభిమానులు తెచ్చిపెట్టే వారు. ఎన్ టి ఆర్ తరువాత అంతటి మాస్ చరిష్మా ఉన్న హీరోగా కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్, రొమాన్స్, డ్రామా చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ క్లాస్ హీరోగా శోభన్ బాబు పేరు గడించారు. ఆయన అభిమానుల్లో మహిళా అభిమానులు ఎక్కువ. 


      Also read :   చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం


మహా సంగ్రామం తో ముగింపు 

మాస్ హీరో కావడంతో కృష్ణ కు సినిమాలలో  కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండే వారు. అది మహాసంగ్రామం ( 1985) కు వచ్చేప్పటికి మరింత పెరిగింది. పేరుకి ఇద్దరు హీరోలు అయినప్పటికీ కృష్ణ హీరోయిజాన్ని అమాంతం పెంచేసి, శోభన్ బాబు పాత్ర ను సపోర్టింగ్ క్యారెక్టర్ స్థాయికి కుదించేయడం శోభన్ అభిమానులను వేదనకు గురి చేసింది. ఆ సినిమా పోస్టర్స్, బ్యానర్స్, కటౌట్స్ లో కూడా శోభన్ బాబు కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అప్పట్లో అభిమానులకు తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. అభిమానుల నిరసన సెగలు శోభన్ బాబు కు గట్టిగానే తగిలాయి. తన అభిమానులకు మానసిక వేదన కలిగినందుకు ఎంతో బాధగా ఉన్నదని, ఇకపై మల్టీ స్టారర్ సినిమాలలో నటించనని శోభన్ బాబు బహిరంగ ప్రకటన చేసే వరకు ఇది దారి తీసింది. మహాసంగ్రామం సినిమా  కృష్ణ - శోభన్ బాబు నటనా జోడీకి  ముగింపు పలికింది. 


కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్ 

లక్ష్మి నివాసం (1966), శ్రీ శ్రీ మర్యాద రామన్న (గెస్ట్ అప్పియరెన్స్ ) (1967), మంచిమిత్రులు (1969), విచిత్ర కుటుంబం (1969), మా మంచి అక్కయ్య (1970), పుట్టినిల్లు మెట్టినిల్లు (1973), గంగ మంగ (1973), కురుక్షేత్రం (1977), మండే గుండెలు (1979), కృష్ణార్జునులు (1982), ముందడుగు (1983), ఇద్దరు దొంగలు (1984), మహాసంగ్రామం (1985)