12, నవంబర్ 2024, మంగళవారం

తెలుగు సినీ ఆణిముత్యం " దేవదాసు " : All time telugu movie classics : Devadasu

తెలుగు సినీ ఆణిముత్యం " దేవదాసు " : All time telugu movie classics : Devadasu




విడుదల : 26 జూన్ 1953

నట వర్గం : అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, సి ఎస్ ఆర్ ఆంజనేయులు, పేకేటి శివరాం 

దర్శకత్వం : వేదాంతం రాఘవయ్య 

నిర్మాత : డి ఎల్ నారాయణ 

నిర్మాణ సంస్థ : వినోదా పిక్చర్స్ 

సంగీతం : సి ఆర్ సుబ్బరామన్ 

ఛాయాగ్రహణం : బి ఎస్ రంగ


తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాలలో మేటి "దేవదాసు". సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ నవల దేవదాసు దీనికి ఆధారం. దేవదాసు, పార్వతిల పాత్రలకు ప్రాణం పోసారు అక్కినేని, సావిత్రిల జంట. నాటికి, నేటికి భగ్న ప్రేమికుల కథ అంటే దేవదాసునే ముందుగా గుర్తుకు వచ్చే ఉన్నత స్థాయిలో సినిమాకు జీవం పోసారు దర్శకుడు వేదాంతం రాఘవయ్య. 


సినిమా అపూర్వ విజయానికి దేవదాసు, పార్వతిల పాత్రలలో ఎ ఎన్ ఆర్, సావిత్రిల నటన ఎంతగా దోహదం చేసిందో..అంతే స్థాయిలో పాటలు కూడా తోడ్పడ్డాయి. "అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా?"..."జగమే మాయ, బ్రతుకే మాయ"..."పల్లెకు పోదాం, పారును చూద్దాం చలో చలో".."కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్"..." ఓ ఓ దేవాదా, ఓ ఓ పార్వతి " .." తానే మారేనా, గుణమ్మేమారేనా "..."కల ఇదని, నిజమిదని"లాంటి పాటలు ఘంటసాల, బాలసరస్వతి, జమునారాణి, జిక్కి ల గానంతో తెలుగు   సినీ గీత జగత్తులో నేటికీ  అజరామరంగా వెలుగుతూనే ఉన్నాయి. 


అప్పటికే సినిమా రంగంలోకి ప్రవేశించి దశాబ్ద కాలం దాటిన అక్కినేని  నట జీవితంలో శ్రీ సీతా రామ జననం, బాలరాజు, కీలు గుర్రం, లైలా మజ్ను, పల్లెటూరి పిల్ల వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నప్పటికీ దేవదాసు అందించిన ఘన విజయం ఒక గొప్ప మలుపు, చరిత్రగా లిఖించబడింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకే ఒక గొప్ప మలుపు, గెలుపుని ఇచ్చింది దేవదాసు. తెలుగు సినిమా దేవదాసుకు ముందు, దేవదాసుకు తరువాత అని చెప్పుకునేలా గతిని మార్చేసింది. అక్కినేని అప్పటికే జానపద, పౌరాణిక పాత్రలు ఎన్నో పోషించి విజయాలు సొంతం చేసుకున్నప్పటికీ ఈ దేవదాసు అక్కినేనిని పూర్తి స్థాయిలో సాంఘిక చిత్ర కథానాయకుడిగా స్థిరపరిచింది అని చెప్పొచ్చు. నాడు మొదలైన ఎ ఎన్నార్, సావిత్రిల హిట్ పెయిర్ ఎన్నో విజయవంతమైన చిత్రాల బంధంగా కొనసాగింది. 


దేవదాసు పాత్రలో నటనే కాదు ఆ పాత్రకు తగ్గ ఆహార్యాన్ని మలచుకోవడానికి అక్కినేని పడిన తపన, కష్టం నటీ నటులకు ఒక సిలబస్ గా మారింది. ముఖం పీక్కుపోయినట్టు, కళ్ళు లోపలికి పోయినట్టు కనిపించడం కోసం ఎన్నో రాత్రిళ్ళు నిద్రపోకుండా ఉండే వారంట..తనపై సీన్ లు కూడా రాత్రి సమయంలో ఎక్కువ ఉండేటట్లు షూటింగ్ ప్లాన్ చేయించే వారు. ఆ శ్రమ, ఆ అంకిత భావమే అపురూప విజయాన్ని అందించింది. 


తెలుగు చిత్ర సీమలో ఒక ఉన్నత స్థానాన్ని సాధించి పెట్టింది.  తాగుబోతు పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించాలంటే అది అక్కినేని తరువాతే ఎవరైనా అన్న పరిస్థితి వచ్చింది. ఒక్క తెలుగు, దక్షిణాది భాషా చిత్రాలలోనే కాదు యావత్ భారత దేశ సినీ రంగంలోనే అటువంటి పాత్రకు రోల్ మోడల్ గా నిలిచారు. హీరోగా తొలి దశలో దేవదాసు, మధ్యలో ప్రేమ నగర్, మలి దశలో ప్రేమాభిషేకం ..భగ్న ప్రేమికుడు, మద్యానికి బానిస అయిన హీరో చిత్రాలే. ఇండస్ట్రీ హిట్ లే . అటువంటి పాత్రలకు అక్కినేని తప్ప మరెవరూ దైర్యంగా ముందుకు రాకుండా చేసాయి. చేసినా తగిన విజయాలను, గుర్తింపును పొందలేక పోయాయి. 


అలనాటి సినీ ఆణిముత్యాలను అప్పటి సినిమా హాళ్ళలో చూసిన అదృష్టవంతులు ఆ మధురానుభూతులను ఆనందంగా వర్ణిస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా..? మీ కుటుంబంలో గానీ, బంధువర్గంలో గానీ ఇలాంటి విశేషాలు విని ఉంటే కామెంట్ చేయండి..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి