17, నవంబర్ 2024, ఆదివారం

"సాహసం సేయరా డింభకా..తెలుగు సినీ అగ్రస్థానం లభించునురా" అని ఎన్ టి ఆర్ ని దీవించిన "పాతాళభైరవి" : NTR Patalabhairavi

 


"సాహసం సేయరా డింభకా.. ఎన్ టి ఆర్  "పాతాళభైరవి"



విడుదల : 15 మార్చ్ 1951

నటవర్గం : ఎన్ టి రామారావు, ఎస్ వి రంగారావు, రేలంగి, సి ఎస్ ఆర్, కె మాలతి, పద్మనాభం 

దర్శకత్వం : కె వి రెడ్డి 

నిర్మాతలు : నాగిరెడ్డి, చక్రపాణి 

సంగీతం : ఘంటసాల

నిర్మాణసంస్థ : విజయా ప్రొడక్షన్స్


                   తెలుగు సినీ చిత్ర సీమకు గర్వకారణంగా నిలిచే అతి కొద్ది సినీ  ఆణిముత్యాలలో "పాతాళభైరవి" మొదటి వరుసలో నిలుస్తుంది. కొన్ని వందల చిత్రాలకు ప్రేరణగా నిలిచిన, భవిష్యత్ లో మరెన్నో రానున్న తోటలో  రాముడు - కోటలో రాణి తరహా ప్రేమ కథల ఇతివృత్తానికి  ఊపిరి పోసిన చిత్ర రాజం. మహా నటులు ఎన్ టి ఆర్, ఎస్ వీ ఆర్ లకు తెలుగు చిత్ర లోకంలో మహా ప్రస్తనాలకు నాంది పలికింది. రాజకుమారిని దక్కించు కోవడం కోసం ఎంతటి సాహసానికైనా సిద్దపడే తోట రాముడి పాత్రలో ఎంతో ఎంతో చలాకీగా, అందంగా, వీరోచితంగా నటించి, జానపద కథానాయకుడు అంటే ఎన్ టి రామారావు అనే సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. " సాహసం సేయరా డింభక...సంకల్పం సిద్ధించునురా..రాజకుమారి లభించునురా" అన్న డైలాగులతో ఎస్ వీ రంగారావు రక్తి కట్టించిన నేపాళ మాంత్రికుడి పాత్ర, ఎన్నో మాయావి పాత్రలకు స్ఫూర్తిగా నిలవడమే కాకుండా,  ఎస్ వీ ఆర్ మహోన్నత నట జీవితానికి బాటలు వేసింది. 


అప్పటికే ఎన్ టి ఆర్ మనదేశం, షావుకారు, పల్లెటూరి పిల్ల వంటి కొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించినప్పటికీ పాతాళభైరవి సాధించిన అథ్భుతమైన విజయంతో  జానపద కథానాయకుడిగా పాపులర్ అయి ఎన్నో సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నారు. "కలవరమాయే మదిలో..నా మదిలో " ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు " " వినవే బాల నా ప్రేమగోల " పాటలు నేటికీ సినీ సంగీత జగత్తులో దృవతారలు.  200 రోజులు ప్రదర్శించబడిన తొలి తెలుగు సినిమా గా రికార్డ్ సృష్టించింది. 


మొట్ట మొదటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన ఏకైక దక్షిణాది చిత్రంగా ఘనత దక్కించుకుంది. CNN - IBN ఇంగ్లీష్ న్యూస్ చానెల్ 2013 లో ప్రకటించిన భారతదేశ ప్రసిద్ద 100 చిత్రాల జాబితాలో స్థానం పొందడం ద్వారా తన విశిష్టతను ఘనంగా చాటుకుంది. పాతాళభైరవి మొదటిసారి థియేటర్ లో విడుదలైనప్పుడు చూసిన ప్రేక్షకులు బహు అరుదు అయినప్పటికీ..రీ రిలీజ్ లో చూసిన వారు చాలామంది ఉంటారు. అలాంటి ప్రేక్షకులు గానీ, ఆనాటి ప్రేక్షకులు చెప్పిన నాటి సినిమా విశేషాలు గానీ మీకు గుర్తుంటే కామెంట్స్ రూపంలో అందరితో పంచుకోండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి