విడుదల : 7 సెప్టెంబర్ 1984
నటవర్గం : బాలకృష్ణ, భానుమతి రామకృష్ణ , సుహాసిని, గొల్లపూడి మారుతీరావు, గోకిన, వై విజయ, బాలాజీ..
దర్శకత్వం : కోడి రామకృష్ణ
నిర్మాత : ఎస్ గోపాల్ రెడ్డి
సంగీతం : కె వి మహదేవన్
నిర్మాణ సంస్థ : భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
1974 లో తండ్రి ఎన్ టి రామారావు దర్శకత్వంలో తెరకెక్కించిన "తాతమ్మ కల" చిత్రం ద్వారా బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసారు నందమూరి బాలకృష్ణ. ఆ తరువాత తండ్రి ఎన్ టి ఆర్ తో కలసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమ కవి, దానవీర శుర కర్ణ, శ్రీ మద్విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాలలో నటించారు. ఎన్ టి ఆర్ రాజకీయ రంగ ప్రవేశ అనంతరం 1984 లో భారతీ వాసు దర్శకత్వం లో మొదటిసారిగా సోలో హీరోగా " సాహసమే జీవితం" చిత్రంతో బాలకృష్ణ రీ ఎంట్రీ ఇచ్చారు. దీనితోపాటు తరువాత వచ్చిన తాతినేని ప్రసాద్ దర్శకత్వంలోని "డిస్కో కింగ్ " ( హిందీ డిస్కో డాన్సర్ కు రీమేక్ ) , కె విశ్వనాథ్ దర్శకత్వంలోని " జననీ జన్మభూమి" చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందలేక పోవడంతో నందమూరి అభిమానులు కొంచెం నిరాశ చెందారు.
ఆ సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాతగా.. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, సుహాసిని జంటగా సీనియర్ నటీమణి భానుమతి రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన "మంగమ్మ గారి మనవడు" సంచలన విజయం సాధించి సరికొత్త రికార్డ్ లను నెలకొల్పింది. 25 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని బాలకృష్ణ కు తొలి సోలో హీరో శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. శ్లాబ్ సిస్టం వచ్చిన తరువాత హైదరాబాద్ లో 565 రోజులు ప్రదర్శించబడిన సినిమాగా చరిత్ర లిఖించింది. ఎన్ టి ఆర్ ఘన వారసత్వాన్ని కొనసాగించే సత్తా ఉన్న వారసుడిగా బాలకృష్ణ నిరూపించుకోవడమే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా స్థానాన్ని పదిలం చేసింది.
"బాలకృష్ణ - భార్గవ్ ఆర్ట్స్" మధ్య ఒక ఆత్మీయ బంధానికి పునాది వేసింది ఈ "మంగమ్మ గారి మనవడు" చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలకు స్వంత చిత్ర నిర్మాణ సంస్థలు ఉండడం సహజం. ఎన్ టి ఆర్, బాలకృష్ణ లకు రామకృష్ణ సినీ స్టూడియోస్, ఎ ఎన్ ఆర్, నాగార్జునలకు అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణకు పద్మాలయా స్టూడియోస్, కృష్ణంరాజు కు గోపీ కృష్ణా మూవీస్, చిరంజీవి కి గీతా ఆర్ట్స్, వెంకటేష్ కు సురేష్ ప్రొడక్షన్స్ స్వంత నిర్మాణ సంస్థలుగా ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఆయా స్వంత సంస్థల కంటే కొన్ని బయటి సంస్థల్లోనే కొందరు హీరోలు ఎక్కువ సినిమాలు చేయడం, ఎక్కువ హిట్ లు దక్కించుకోవడం, ఎక్కువ అనుబంధం కలిగి ఉండడం జరుగుతుంది.
భార్గవ్ ఆర్ట్స్ కు బాలకృష్ణ కు అదే తరహా అనుబంధం ఉంటుంది. బాలకృష్ణ తో మంగమ్మ గారి మనవడు (1984), ముద్దుల కృష్ణయ్య (1986), మువ్వగోపాలుడు (1987), ముద్దుల మావయ్య (1989), ముద్దుల మేనల్లుడు ( 1990 ), మాతో పెట్టుకోకు (1995) చిత్రాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. ఇందులో మువ్వ గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య లు శతదినోత్సవ చిత్రాలు కాగా, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్యలు ఇండస్ట్రీ హిట్ లు. ముద్దులమేనల్లుడు, మాతో పెట్టుకోకు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేదు. భార్గవ్ ఆర్ట్స్ లో మరే హీరో ఇన్ని చిత్రాలు చెయ్యలేదు. ఒక్క నాగార్జునతో "మురళీకృష్ణుడు" (1988) తప్పించి మరే అగ్ర హీరోతోనూ సినిమాలు చేయలేదు. సుమన్, భానుచందర్, అర్జున్, రాజశేఖర్, సురేష్, వడ్డే నవీన్ లతో చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించారు.
గ్రామీణ కథానాయకుడు పాత్రలో బాలకృష్ణ కు ఇంకెవరూ సాటి రారు అన్న ప్రశంసలను భార్గవ్ ఆర్ట్స్ అందించింది. మంగమ్మ గారి మనవడు నుండి ముద్దుల మేనల్లుడు వరకు ఐదు చిత్రాలలో ఒక విశేషం ఉంది. ఒక గొప్ప కాంబినేషన్ కొనసాగుతూ వచ్చింది. ప్రొడక్షన్ - భార్గవ్ ఆర్ట్స్, హీరో - బాలకృష్ణ, దర్శకుడు - కోడి రామకృష్ణ, సంగీతం - కె వి మహదేవన్, నిర్మాత - ఎస్ గోపాల్ రెడ్డి. ఈ సినిమాల పేర్లు అన్నీ "మ" అక్షరంతో మొదలవుతాయి. ఏవో రెండు, మూడు సినిమాలు తప్ప భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ "మ" అక్షరం, దర్శకుడు కోడి రామకృష్ణ సెంటిమెంట్ నే పాటించాయి. బాలకృష్ణ తో చివరి చిత్రం "మాతో పెట్టుకోకు" కు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, సంగీతం మాధవపెద్ది సురేష్.
"మంగమ్మగారి మనవడు" మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్. దీనిలోని "దంచవే మేనత్త కూతురా " సాంగ్ ఇప్పటకీ రీమిక్స్, డిజే స్టైల్స్ తో ఉర్రూతలూగిస్తునే ఉంది. "వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త "... "గుమ్మచూపు నిమ్మ ముల్లు" పాటలు ఎంతగానో అలరించాయి. చాన్నాళ్ళ తరువాత ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటి మంగమ్మ పాత్రకు ప్రాణం పోయడంతోపాటు "శ్రీ సూర్య నారాయణ మేలుకో" పాటను ఆలపించారు. ఈ చిత్ర ఘన విజయంతో ఆమె మరెన్నో సినిమాలలో తన నటన కొనసాగించారు. "చందురూడు నిన్ను చూసి చేతులెత్తాడు" పాటలో రాముడు, కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రలను పోషించి తండ్రికి తగ్గ తనయుడిగా అభిమానులను మెప్పించడమే కాకుండా భవిష్యత్ లో అటువంటి పాత్రలకు తానే సరిసాటి అని బాలకృష్ణ నిరూపించారు. మొత్తంగా మంగమ్మ గారి మనవడు "భార్గవ్ ఆర్ట్స్ - బాలకృష్ణ" లకే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకే ఒక గొప్ప విజయంగా నిలిచింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి