"పుష్ప" తో మరో తెలుగు పాన్ ఇండియా స్టార్ హీరో గా ఎదిగిన అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలు జంటగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన " పుష్ప - 2" ( తెలుగు, హిందీ ) నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 వేల థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి సందడి చేస్తుంది. తొలుతగా వస్తున్న రివ్యూలు, సోషల్ మీడియా స్పందనలు ప్రకారం మరో తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్నో వివాదాలు, అవరోధాలను అధిగమించి విడుదలైన పుష్ప సరికొత్త రికార్డ్స్ సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో అల్లు అర్జున్ యాక్షన్, డ్యాన్ పెర్ఫామెన్స్ హైలెట్ అంటున్నారు. ఒక సీన్ ను మించి ఇంకొక సీన్ చిత్రీకరణతో అభిమానులకు కన్నుల పండుగ చేసారని రివ్యూలు చెప్తున్నాయి.
ఇప్పటి వరకూ ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్, కల్కి చిత్రాల ఘన విజయాలతో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటగా..ఆర్ ఆర్ ఆర్ తో రామ్ చరణ్, ఆర్ ఆర్ ఆర్, దేవర ఘన విజయాలతో ఎన్ టి ఆర్ పాన్ ఇండియా స్టార్స్ హోదాలను దక్కించుకున్నారు. పుష్ప ను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి సిద్దపడినప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ లు మితిమీరిన ఆత్మవిశ్వాసం, సాహసం చేస్తున్నారని తెలుగు చిత్ర పరిశ్రమ నుండి గట్టిగానే వ్యంగ్య పూరిత వ్యాఖ్యలు, విమర్శలు వినిపించాయి. అల్లు అర్జున్ మార్కెట్ ను పెంచుకోవడానికి ఇది అల్లు అరవింద్ గుడ్డిగా అమలు చేస్తున్న స్ట్రాటజీ అని కూడా అన్నారు.
అందుకు తగ్గట్టుగానే పుష్ప విడుదలైన రోజు డివైడ్ టాక్ రావడంతో "ముందే నేను చెప్పలా" తరహ బ్యాచ్ లు, కొంత మంది సినీ విశ్లేషకులు, అనుభవజ్ఞులు కొంత సంతృప్తి పడిన విషయం వాస్తవం. నెమ్మది నెమ్మదిగా "పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా..ఫైర్" డైలాగ్ లెక్క తెలుగు, అంతకు మించి హిందీ మార్కెట్ లో కుమ్మేసింది. తెలుగు చిత్ర సీమ నుండి మరో పాన్ ఇండియా స్టార్ ని పరిచయం చేసింది. తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి తెలియ చెప్పింది. మన దేశ ప్రముఖ క్రీడాకారులతో పాటుగా, అంతర్జాతీయ క్రీడా కారులు, సెలబ్రిటీలు పుష్ప మేనరిజం ను అనుకరించి విశ్వవ్యాప్త ప్రచారాన్ని ఇచ్చారు. అలాగే తొలిసారిగా తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కూడా పుష్ప దక్కించింది.
ఈ పుష్ప- 2 విడుదల కూడా అంత ఆశాజనక వాతావరణంలో జరుగలేదు. గత ఆంద్రప్రదేశ్ ఎన్నికలలో అల్లు అర్జున్ తన మిత్రుడు, వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవి కి మద్దతుగా నంద్యాలకు వెళ్ళడం... అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మెగా, అల్లు అభిమానుల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇంతలో నాగబాబు ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చేవాడు మావాడైనా పరాయివాడే అన్న విధంగా ట్వీట్ పోస్ట్ చేయడం, ఆ తరువాత డిలేట్ చేయడం కూడా ఈ వివాదాన్ని మరింత రాజేసింది. ఇటీవల ఒక సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమాల తీరుపై చేసిన వ్యాఖ్యలు కూడా ఎవరికి తగిన రీతిగా వారు అన్వయించుకొని ఈ విభేదాలు తారాస్థాయికి చేర్చారు. అసలు వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియా పరంగా ఇరు అభిమానుల మధ్య పెద్ద యుద్దమే నడిచింది. పుష్ప - 2 టికెట్ రేట్లు భారీగా పెంచారన్న మరో వివాదం రేగింది.
సినిమా టికెట్ రెట్ల పెంపు, ప్రీనియర్ షోలకు ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడం, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అల్లు అర్జున్ ట్వీట్ వేయడం విడుదలకు ముందు వాతావరణాన్నిప్రశాంతపరిచింది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించి ధన్యవాదాలు తెలుపడం మెగా అభిమానులను శాంతపరిచింది. విడుదలైన అన్ని చోట్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో పుష్ప - 2 రికార్డ్ ల మాస్ జాతరకు ఏది ఏమైనా మన తెలుగు సినిమా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మన ఖ్యాతిని ఇనుమడింపజేస్తుండడం తెలుగు సినీ ప్రేక్షకులుగా మనకు ఎంతో గర్వ కారణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి