తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి తరం మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్
కృష్ణ, శోభన్ బాబుల కాంబినేషన్ లో ఎన్నోవిజయవంతమైన సినిమాలు వచ్చినప్పటికీ 19 85 లో సంయుక్త మూవీస్ బ్యానర్ పై విడుదలైన " మహాసంగ్రామం" వీరిరువురి కాంబినేషన్ లో చివరి సినిమాగా మిగిలిపోయింది. నాటి అగ్ర కథానాయకులు NT రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తరువాత ప్రభావవంతమైన స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది కృష్ణ, శోభన్ బాబులే. ఎన్టీఆర్ తరహాలో రివల్యుషన్, థ్రిల్లర్, యాక్షన్ ప్రధాన చిత్రాలతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంది కృష్ణ కాగా, ఎ ఎన్నార్ లాగా రొమాన్స్, ఎమోషన్స్, ప్యామిలీ డ్రామా చిత్రాలతో క్లాస్ హీరోగా ఆదరణ పొందారు. సినిమాలు ఎంత కలెక్షన్స్, ఎన్ని రోజులు, ఎన్ని కేంద్రాలు, ఎన్ని థియేటర్స్ లలో రికార్డ్స్ సృష్టించాయి అన్న విషయంలో ముందుగా ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ అభిమానుల మధ్య పోటీ ఉండేది.
ఆ తరువాత ఆ పోటీ వాతావరణం కృష్ణ - శోభన్ బాబు అభిమానులకు కూడా అలవడింది. అప్పట్లో అగ్ర కథానాయకులుగా వెలుగొందిన ఎన్ టి ఆర్, ఎ ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లు ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించారు. ఎన్ఎ టి ఆర్ తోనూ, ఎ ఎన్ ఆర్ తోనూ శోభన్ బాబు చాలా సినిమాలు చేసారు. అలాగే ఎన్ టి ఆర్ తో , ఎ ఎన్ ఆర్ తో కృష్ణ కూడా చెప్పుకోదగ్గ సినిమాలే చేసారు. ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ ల కంటే శోభన్ బాబు - కృష్ణలు చాలా జూనియర్స్ కాబట్టి వారు కలిసి నటించిన సినిమాలలో సహజంగా ఎన్ టి ఆర్ , ఎ ఎన్ ఆర్ పాత్రలకే ప్రాధాన్యత ఉండేది.
ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ మల్టీ స్టారర్ మూవీస్
ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ లు తమ తొలినాళ్ళలో పల్లెటూరి పిల్ల (1950) నుండి... సత్యం శివం ( 19 81) వరకు మూడు దశాబ్దాలలో ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు చేసారు. వీటిలో మిస్సమ్మ, తెనాలిరామకృష్ణ, మాయాబజార్, భూకైలాస్, గుండమ్మకథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. సీనియర్ హీరో అయినప్పటికీ ఎ ఎన్ ఆర్ పల్లెటూరి పిల్ల, మిస్సమ్మ తదితర చిత్రాలలో ఎన్ టి ఆర్ కంటే ప్రాధాన్యత తక్కువ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే కృష్ణ కంటే సీనియర్ అయిన శోభన్ బాబు తొలిరోజుల్లో ఇద్దరూ కలిసి నటించిన సినిమాలలో తక్కువ నిడివి, ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించారు.
అప్పట్లో వాళ్ళు సినిమాలో తనకు ఇచ్చిన పాత్రకు తగిన న్యాయం చేసామా..లేదా..అన్న కోణం లోనే చూసే వారు తప్ప, పాత్ర ప్రాధాన్యత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే తమకంటూ ఒక స్టార్ డం, తమకంటూ అభిమాన అనుచరగణం ఏర్పడిందో..అప్పటి నుండి మల్టీ స్టారర్ చిత్రం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి వచ్చేది. సినిమాలో తమ హీరోకి ఏమాత్రం ప్రాధాన్యత తగ్గినా తమ ఉత్తరాల ద్వారా, అభిమాన సంఘాల నాయకుల ద్వారా తమ అసంతృప్తిని, ఆవేదనను ఆ హీరోకి తెలియజేసేవారు.
కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ క్రేజ్
అప్పట్లో ఎన్ టి ఆర్ - ఎ ఎన్ ఆర్ మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్ కి ఎంత క్రేజ్ ఉండేదో ఆ తరువాత కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ మూవీస్ కి అంత క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ సినిమాలకు కూడా తొలి రోజుల్లో అంత పట్టింపు ఉండేది కాదు గానీ..తరువాత తరువాత హీరోలుగా ఒక స్థాయి, తమకంటూ భారీ అభిమాన ప్రేక్షక బలం ఏర్పడిన తదుపరి సినిమాలో పాత్రల ప్రాధాన్యత తోపాటుగా, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఆఖరికి ధరించే దుస్తులు కూడా తూకం వేసుకోవాల్సి వచ్చేది. మా హీరోకి ఒక పాట ఎక్కువ అంటే, మా హీరోకి ఒక ఫైట్ ఎక్కువ అని, మా హీరోనే ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ అంటే..మా హీరోదే ఫస్ట్ సాంగ్ అని ఇలా ప్రతి విషయంలో ఎక్కువ తక్కువ వాగ్వివాదాలు జరిగేవి. ఒకప్రక్క మల్టీ స్టారర్ మూవీస్ అంటే మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గరనుండే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండేవారు. ఎక్కడ ఏ కొంచెం తేడా జరిగినా అభిమానులు దుమ్మెత్తిపోస్తారని అటు హీరోలు, ఇటు దర్శక, నిర్మాతలు తెగ కంగారు పడుతుండేవారు. ఈ మల్టీ స్టారర్ మూవీస్ జయాపజయాలతో నిమిత్తం లేకుండా భారీ ఓపెనింగ్స్, తొలి వారం రికార్డ్ కలెక్షన్స్ తెచ్చిపెట్టేవి.
ఆ ధైర్యంతో నిర్మాతలు మల్టీ స్టారర్ సినిమాల నిర్మాణానికి చాలా ఆసక్తి ప్రదర్శించేవారు. మొదట్లో కృష్ణ - శోభన్ బాబు కాంబినేషన్ సినిమాలలో కూడా తమ పాత్రల ప్రాధాన్యత గురించి పెద్దగా పట్టించుకొనలేదు. ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్ ల తరువాత అగ్ర హీరోలుగా కృష్ణ , శోభన్ బాబులు తమ వ్యక్తిగత ఇమేజ్ లు సాధించడంతోనే ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న సమస్యను తరుచుగా అభిమానులు తెచ్చిపెట్టే వారు. ఎన్ టి ఆర్ తరువాత అంతటి మాస్ చరిష్మా ఉన్న హీరోగా కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్, రొమాన్స్, డ్రామా చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ క్లాస్ హీరోగా శోభన్ బాబు పేరు గడించారు. ఆయన అభిమానుల్లో మహిళా అభిమానులు ఎక్కువ.
Also read : చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం
మహా సంగ్రామం తో ముగింపు
మాస్ హీరో కావడంతో కృష్ణ కు సినిమాలలో కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండే వారు. అది మహాసంగ్రామం ( 1985) కు వచ్చేప్పటికి మరింత పెరిగింది. పేరుకి ఇద్దరు హీరోలు అయినప్పటికీ కృష్ణ హీరోయిజాన్ని అమాంతం పెంచేసి, శోభన్ బాబు పాత్ర ను సపోర్టింగ్ క్యారెక్టర్ స్థాయికి కుదించేయడం శోభన్ అభిమానులను వేదనకు గురి చేసింది. ఆ సినిమా పోస్టర్స్, బ్యానర్స్, కటౌట్స్ లో కూడా శోభన్ బాబు కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అప్పట్లో అభిమానులకు తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. అభిమానుల నిరసన సెగలు శోభన్ బాబు కు గట్టిగానే తగిలాయి. తన అభిమానులకు మానసిక వేదన కలిగినందుకు ఎంతో బాధగా ఉన్నదని, ఇకపై మల్టీ స్టారర్ సినిమాలలో నటించనని శోభన్ బాబు బహిరంగ ప్రకటన చేసే వరకు ఇది దారి తీసింది. మహాసంగ్రామం సినిమా కృష్ణ - శోభన్ బాబు నటనా జోడీకి ముగింపు పలికింది.
కృష్ణ - శోభన్ బాబు మల్టీ స్టారర్ కాంబినేషన్ మూవీస్
లక్ష్మి నివాసం (1966), శ్రీ శ్రీ మర్యాద రామన్న (గెస్ట్ అప్పియరెన్స్ ) (1967), మంచిమిత్రులు (1969), విచిత్ర కుటుంబం (1969), మా మంచి అక్కయ్య (1970), పుట్టినిల్లు మెట్టినిల్లు (1973), గంగ మంగ (1973), కురుక్షేత్రం (1977), మండే గుండెలు (1979), కృష్ణార్జునులు (1982), ముందడుగు (1983), ఇద్దరు దొంగలు (1984), మహాసంగ్రామం (1985)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి