1, డిసెంబర్ 2024, ఆదివారం

చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం : "Khaidi" A milestone movie for Megastar Chiranjeevi

 


చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం : "Khaidi" A milestone movie for Megastar Chiranjeevi




విడుదల : 28 అక్టోబర్ 1983

నటవర్గం : చిరంజీవి, మాధవి, సుమలత, రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి, రంగనాథ్, చలపతిరావు, సంగీత, సంయుక్త, సుత్తివేలు మొ,,

దర్శకత్వం : ఎ కోదండరామిరెడ్డి

నిర్మాతలు : ధనుంజయ రెడ్డి, నరసారెడ్డి, సుధాకర్ రెడ్డి 

సంగీతం : చక్రవర్తి 

నిర్మాణ సంస్థ : సంయుక్త మూవీస్ 


                              1978 లో పునాదిరాళ్ళు సినిమా తో చిరంజీవి సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ మొదట విడుదలైన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులు తెలుగు సినీ పరిశ్రమను ప్రభలంగా  ఏలుతున్న సమయంలో... ఎవరి అండ లేకుండా తన నటన ప్రతిభ, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న చిరంజీవికి ఖైదీ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. 


                                  అప్పటికే 60 కి పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ అప్పియరెన్స్ గా నటించిన చిరంజీవి నట జీవితాన్ని ఖైదీ చిత్రం మాత్రం ఒక గొప్ప మలుపు తిప్పింది. మొగుడు కావాలి, న్యాయం కావాలి,  చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, అభిలాష, మగ మహారాజు వంటి శతదినోత్సవ చిత్రాలు ఉన్నప్పటికీ ఖైదీ మాత్రం తెలుగు చిత్ర సీమలో చిరంజీవికి అగ్ర హీరోగా ఒక స్థానాన్ని సుస్థిరం చేయడానికి దోహదం చేసింది అని ఘంటాపథంగా చెప్పొచ్చు. 


                                  తెలుగు సినీ రంగంలో బిగ్గెస్ట్ మాస్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్న ఎన్ టి రామారావు రాజకీయ ప్రవేశం చేసి, తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి కావడంతో..ఆయన గైర్హాజరీలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రభావవంత స్థానం ఖాళీ అయ్యి కొద్ది నైరాశ్యంలో ఉంది. ఆ సంధి సమయంలో ఒక గొప్ప శకానికి నాంది పడింది. ఉరకలు వేస్తున్న యువ రక్తం..చలాకీ నటన, నాట్యంతో..వచ్చినది ఏపాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేస్తూ..సినిమాల మీద సినిమాల అవకాశం దక్కించుకుంటూ ప్రేక్షకులు తనపై ప్రత్యేక దృష్టి సారించేలా పయనం సాగిస్తున్నారు చిరంజీవి. 


                                  కొన్ని శతదినోత్సవ చిత్రాలతోపాటుగా శుభలేఖ చిత్రానికి బెస్ట్ ఆక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకొని తానేంటో నిరూపించుకున్నారు.   నెల్లూరు కి చెందిన నూతన నిర్మాతలు సంయుక్త మూవీస్ నిర్మాణ సంస్థ తొలి చిత్రం తమ నెల్లూరు కే చెందిన దర్శకుడు ఎ కోదండరామిరెడ్డి తో తీయడానికి సిద్దం అయ్యారు. కోదండరామిరెడ్డి అప్పటికే చిరంజీవితో న్యాయంకావాలి, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్ళు, అభిలాష, శివుడు శివుడు శివుడు తదితర సినిమాలు చేసి  ఉండడం,  అందులోనూ నెల్లూరు అనుబంధం చిరంజీవిని హీరోగా తీసుకోవడానికి తోడ్పడింది. 


                                     సిల్వెస్టర్ స్టాలోన్ హాలీవుడ్  మూవీ ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో హీరో గెటప్ కు రూపకల్పన చేసారు. చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్ ఆరోజుల్ల్లో ఒక ట్రెండ్ సెట్టర్. భూస్వామి ఆగడాలను ఎదిరించే కథానాయకుడు సూర్యం పాత్రలో చిరంజీవి శిఖరాగ్ర నటనతో ప్రేక్షకుల నీరాజనాలు అందుకోవడమే కాకుండా..అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. భావోద్వేగ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలులో చిరంజీవి నటన హై రేంజ్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఫైట్. ఇప్పటికీ సినిమాల్లో పోలీస్ స్టేషన్ ఫైట్ సన్నివేశం అంటే ఖైదీ పోలీస్ స్టేషన్ ఫైట్ తోనే బెంచ్ మార్క్ కంపేరిజన్ చేస్తుంటారు. 


                                        సినిమాలో పాటలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి. " రగులుతోంది మొగలి పొద " పాట అయితే చిరంజీవి  టాప్ సాంగ్స్ లో ఒకటి. ఈ ఖైదీ ఘన విజయం తరువాత చిరంజీవి - కోదండరామిరెడ్డి ల కాంబినేషన్ లో  గుండా , ఛాలెంజ్, దొంగ, విజేత, రాక్షసుడు, దొంగమొగుడు, పసివాడిప్రాణం, జేబుదొంగ, మరణ మృదంగం , త్రినేత్రుడు, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు, కొండవీటిదొంగ, ముఠామేస్త్రి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. చిరంజీవి సినిమాలలో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన ఖ్యాతి ఎ కోదండరామిరెడ్డికి దక్కింది. మెగాస్టార్ చిరంజీవిగా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి ఖైదీ ఒక  గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి