28, నవంబర్ 2024, గురువారం

నాటికీ, నేటికీ కృష్ణ " సింహాసనం " సినిమా ఒక చరిత్ర : Simhasanam Movie Visual Wonder : Superstar Krishna


నాటికీ, నేటికీ కృష్ణ  " సింహాసనం " సినిమా ఒక చరిత్ర :  Simhasanam Movie Visual Wonder : Superstar Krishna



విడుదల : 21 మార్చ్  

నటవర్గం : కృష్ణ (ద్విపాత్రాభినయం), జయప్రద, రాధ, మందాకిని (తొలిపరిచయం) , కాంతారావు, సత్యనారాయణ, గుమ్మడి, అంజాద్ఖాన్ (తొలిపరిచయం), వహీదా రెహ్మన్, ప్రభాకరరెడ్డి , గిరిబాబు మొ,,

కథ, దర్శకత్వం, నిర్మాత : కృష్ణ

సంగీతం : బప్పీలహరి ( తొలిపరిచయం) 

గానం : రాజ్ సీతారం, పి. సుశీల 

ఛాయాగ్రహణం : కె  ఎస్ ఆర్ స్వామి 

నిర్మాణ సంస్థ : పద్మాలయా స్టూడియోస్  


                                    తెలుగు సినీ పరిశ్రమలో ధైర్య సాహసాలకు, అనితర సాధ్య ప్రయోగాలకు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త హంగులు, ఆదునిక పరిజ్ఞానం అయితేగానీ... నూతన నటీ నటులు, సాంకేతిక నిపుణులు అయితేగానీ పరిచయం చేయడం, ప్రోత్సహించడంలో కృష్ణ ముందు ఉండేవారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలలో నటించడం, నిర్మించడంలో నిరంతరం తలమునకలుగా ఉండేవారు. 


సినిమా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు ఆయన పేరు చెప్పుకొని భరోసాగా ఉండేవి. తన సినిమా వలన ఏ నిర్మాత అయినా నష్ట పోయాడు అని తెలిస్తే వెంటనే మరో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించి ఆదుకునేవారని పరిశ్రమలో బాహాటంగానే చెప్పుకునేవారు.  తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రం " గూడచారి 116", తొలి తెలుగు కౌబాయ్ చిత్రం " మోసగాళ్ళకు మోసగాడు ", తొలి తెలుగు  సినిమాస్కోప్ చిత్రం " అల్లూరి సీతారామరాజు" లలో నటించిన ఘనత ఆయన సొంతం. 


అదే విధంగా సినిమా బాల్కనీ టికెట్ 4,5 రూపాయలు ఉన్న కాలంలో 3 కోట్ల భారీ బడ్జట్ తో అత్యంత భారీ తారాగణం, భారీ సెట్టింగ్స్ ,  వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లు సినీ సాంకేతిక బృందాల సమాహారంతో " సింహాసనం" తొలి  తెలుగు 70 ఎం ఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్  చిత్రం  నిర్మించారు. కృష్ణ స్వీయ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేసారు. బాలీవుడ్ హీరోయిన్ మందాకిని,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజాద్ ఖాన్ లను తెలుగు తెరకు పరిచయం చేసారు. అదే విధంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరికి తొలి తెలుగు అవకాశం అందించారు. 

మహా మహుల నట విన్యాస పౌరాణిక చిత్ర రాజం "మాయాబజార్" :Telugu movie classic Old Mayabazar

కొన్ని అనివార్య కారణాల వలన తెలుగు గాయకుడిగా ఏకచ్చత్రదిపత్యంగా ఏలుతున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంని కాదని వర్ధమాన  గాయకుడు రాజ్ సీతారాం కు ఈ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా అవకాశం కల్పించడం అప్పట్లో పెను ప్రయోగం, పెను సంచలనమే. మళ్ళీ కృష్ణ - బాలసుబ్రహ్మణ్యంల మధ్య సయోధ్య కుదిరే వరకు రాజ్ సీతారాం కృష్ణ చిత్రాలకు ప్రత్యేక గాయకుడిగా పేరుపడ్డారు. సింహాసనం  ఘన విజయంలో పాటలు కూడా కీలక పాత్ర వహించాయని చెప్పొచ్చు.  " ఆకాశంలో ఒక తార "... "గుమ్మా గుమ్మా ముద్దుగుమ్మ "..."వహ్వా నీ యవ్వనం "..'ఇది కల అని నేననుకోనా".. "వయ్యారమంత ఇచ్చే కౌగిలి "  పాటలు ఆరోజుల్లోనే కాదు ఇప్పటి శ్రోతలను కూడా విశేషంగా అలరిస్తాయి. 


ఈ సినిమా స్థాయికి తగ్గట్టే పబ్లిసిటీలో కూడా భారీ తనాన్ని ప్రదర్శించారు. విజయవాడ, హైదరాబాద్ ఇతర పెద్ద నగరాలలో 100 అడుగుల కృష్ణ భారీ కటౌట్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఈ సినిమా విడుదలకు అభిమానులు, ప్రేక్షకులు వెల్లువలా విరుచుకుపడ్డారు. విజయవాడ రాజ్ 70 ఎం ఎం లో చూస్తేనే అసలు మజా అని ఏలూరు, తాడేపల్లి గూడెం , భీమవరం, కైకలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల నుండి అభిమానులు తరలి వెళ్ళారంటేనే అప్పట్లో "సింహాసనం" మరియు కృష్ణ ల క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 


85 ప్రింట్లతో దక్షిణాదిలోని 153 థియేటర్స్ లో విడుదల అయ్యి తొలి వారంలోనే కోటి యాభై లక్షల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మొత్తంగా నాలుగున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ తో రికార్డ్ నెలకొల్పింది. 6 కేంద్రాలలో ( హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ ) శతదినోత్సవం జరుపుకుంది. 

"సాహసం సేయరా డింభకా..తెలుగు సినీ అగ్రస్థానం లభించునురా" అని ఎన్ టి ఆర్ ని దీవించిన "పాతాళభైరవి" : NTR Patalabhairavi 


మద్రాస్ సముద్ర తీరంలోని విజిపి గార్డెన్స్ లో జరిగిన "సింహాసనం" శతదినోత్సవ వేడుకలకు వందలాది వాహనాల్లో తరలి వెళ్ళిన అశేష కృష్ణ అభిమాన జన సందోహాన్ని చూసి తమిళనాడు ప్రజలు ఆశ్చర్య పడ్డారు. ఈరోజు బాహుబలి తో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తం అయినా గానీ..సాంకేతికత, ఆర్ధిక వనరులు అంతంత మాత్రంగా ఉన్న ఆనాటి రోజుల్లో "సింహాసనం" చిత్ర నిర్మాణం  సాహసం..చరిత్రాత్మకం..చరితార్థం..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి