విడుదల : 27 మార్చ్ 1957
నటవర్గం : ఎన్ టి ఆర్ , ఏ ఎన్ ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, గుమ్మడి,ముక్కామల, సి ఎస్ ఆర్, నాగభూషణం, మిక్కిలినేని, ఛాయాదేవి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం, అల్లురామలింగయ్య, రమణారెడ్డి మొ..
దర్శకత్వం : కె వి రెడ్డి
నిర్మాతలు : నాగిరెడ్డి, చక్రపాణి
సంగీతం : ఘంటసాల
ఛాయాగ్రహణం : మార్కస్ బార్ట్లీ
నిర్మాణ సంస్థ : విజయా ప్రొడక్షన్స్
మహా మహుల నట విన్యాస పౌరాణిక చిత్ర రాజం "మాయాబజార్"
తెలుగు చిత్రసీమలోనే కాకుండా యావత్ భారత దేశ చలనచిత్ర పరిశ్రమలలో నాటికీ, నేటికి మేటిగా నిలిచిన పౌరాణిక చిత్ర రాజం మాయాబజార్. ఎందరో మహా నటులు, నటీమణుల సమ్మేళనం. ఎన్ టి రామారావు తొలిసారిగా కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా..అది మొదలు కృష్ణుడంటే ఎన్ టి ఆర్ తప్ప మరో నటుడిని ఆపాత్రలో ప్రేక్షకులు ఊహించుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి కల్పించారు. ఒక్క కృష్ణుడు మాత్రమే కాదు రాముడు, భీముడు, శివుడు, దుర్యోధనుడు, రావణాసురుడు ఇలా ఏ ప్రధాన పౌరాణిక పాత్ర అయినా ఎన్ టి ఆర్ మాత్రమే పరిపూర్ణ న్యాయం చేయగలడు అన్న నిశ్చయానికి ప్రేక్షకులు వచ్చేశారు. అభిమన్యుడు - శశిరేఖ ల పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రిల ముగ్ధ మనోహర అభినయం అదనపు ఆకర్షణ. ఇక ఘటోత్కచుడు గా ఎస్వీ రంగారావు తన నట విశ్వరూపమే ప్రదర్శించారు. ఈయనకు పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడు గా ఎంతటి పేరు వచ్చిందో..ఘటోత్కచుడు పాత్ర కూడా అదే స్థాయి గౌరవాన్ని తెచ్చింది.
తెలుగు సినీ ఆణిముత్యం " దేవదాసు " : All time telugu movie classics : Devadasu
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లోనే పరిమిత వనరులతో అథ్భుతమైన కెమెరా పనితనం, కళాత్మక సెట్టింగ్స్ తోనూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. మరీ ముఖ్యంగా ఘటోత్కచుడు, అతని అనుచరులు ప్రదర్శించే మాయలు, మంత్రాలు టక్కు టమార విద్యలు అబ్బురపరుస్తాయి. పెళ్లి విందు నేపథ్యంలో ఘటోత్కచుడు పై వచ్చే " వివాహ భోజనంబు..వింతైన వంటకంబు" పాట సినిమాకే హైలైట్. ఈ తరం పిల్లలను కూడా ఈ పాట విశేషంగా అలరిస్తుండడం గొప్ప విషయమేగా..? ఈపాట నేటికీ సినిమాలకు, టివి సీరియళ్ళకు, హోటళ్ళు, రెస్టారెంట్ తదితరాలకు పేరులుగా పెట్టుకోవడం, విందు, వినోదాలలో సందడి చేస్తుండడం సర్వ సాధారణంగా జరిగేదే..అదే విధంగా "లాహిరి లాహిరి లాహిరిలో ".." చూపులు కలిసిన శుభవేళ "..."నీవేనా నను తలిచినది"..."అహనా పెళ్ళియంట" పాటలు నేటికీ సినీ సంగీత ప్రియులకు వీనుల విందు చేస్తుంటాయి.
"సాహసం సేయరా డింభకా..తెలుగు సినీ అగ్రస్థానం లభించునురా" అని ఎన్ టి ఆర్ ని దీవించిన "పాతాళభైరవి"
ప్రఖ్యాత విజయ ప్రొడక్షన్స్ పతాకంపై దిగ్ దర్శకుడు కె వి రెడ్డి దర్శకత్వంలో నాగిరెడ్డి, చక్రపాణినిర్మించిన ఈ మాయాబజార్ అఖండ విజయాన్ని సాధించి, అప్పట్లోనే 24 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. 2013 లో సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ జాతీయ ఇంగ్లీష్ న్యూస్ చానల్ ప్రకటించిన 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ ఆఫ్ ఆల్ టైం జాబితాలో "మాయాబజార్" కి స్థానం దక్కడం సముచితమే కదా..! మన తెలుగు ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే సినిమాలలో ఈ మాయాబజార్ ఎన్నటికీ ముందు వరుసలోనే ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి