విడుదల : 5 అక్టోబర్ 1989
నటవర్గం : నాగార్జున, అమల, రఘువరన్, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, జెడి చక్రవర్తి, చిన్న, ఉత్తేజ్ ...
కథ, కథనం, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు : అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర
సంగీతం : ఇళయరాజా
ఛాయాగ్రహణం : ఎస్ గోపాల్ రెడ్డి
నిర్మాణ సంస్థ : అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్
" శివ " చిత్రం నాగార్జున, రామ్ గోపాల్ వర్మ సినీ జీవితానికే కాకుండా..తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతీయ చిత్ర పరిశ్రమకే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తెలుగు సినీ రంగంలో ఆధునిక సినిమా గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి "శివ" కు ముందు, "శివ" కు తరువాత అని చెప్పుకోనేలా చరిత్రను మార్చేసింది. సినిమా అంటే ఇలా ఉండాలి, ఇలా తీయాలి, ఇలా ప్రచారం చేయాలి, ఇలా ప్రేక్షకుల ముందుకు తేవాలి అని కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న సాంప్రదాయ విధానాలను సమూలంగా మార్చేసింది.
ఎంతలా అంటే.."శివ" విడుదలై మూడున్నర దశాబ్దాలు అవుతున్నప్పటికీ ప్రస్తుత సినిమాలలో ఎక్కడో ఒకచోట ఆ ఛాయలు, ప్రభావం కనిపిస్తూనే ఉన్నంతగా..! కాలేజ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు, కాలేజ్ సాంగ్స్, మాఫియా నేపథ్య కథలు, సన్నివేశాలు ఉంటే అది శివ తో పోల్చి చూడడం కామన్ అయిపొయింది. యాక్షన్, మ్యూజిక్, ఫైట్స్, టేకింగ్, పబ్లిసిటీ ఇలా సినిమాకు సంబంధించిన అన్ని ప్రక్రియలలోనూ ఒక నూతన ఒరవడి సృష్టించింది.
Also read : చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం
చిత్ర పరిశ్రమలో ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్, కృష్ణ , శోభన్ బాబులు సుదీర్ఘ కాలం మొదటి తరం అగ్ర కథానాయకులుగా, అభిమానుల ఆరాధ్య దైవాలుగా విశేష ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. అదే విధంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు రెండో తరం అగ్ర హీరోలుగా కొన్ని దశాబ్దాలు తెలుగు సినీ సీమలో తమ ప్రాభవాన్ని. ఘనంగా చాటారు..నేటికి సైతం చాటుతున్నారు. ఈ రెండో తరం హవా 80 ల్లో మొదలైంది.
70ల్లోనే సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ 1983 లో వచ్చిన "ఖైదీ" అఖండ విజయం చిరంజీవిని అగ్ర కథానాయకుడిని చేసింది. బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో చేసినప్పటికీ 1984 లో వచ్చిన " మంగమ్మ గారి మనవడు " బాలకృష్ణ ను నందమూరి వారసుడిగా, అగ్ర హీరోగా నిలబెట్టింది. ఇక మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు తనయుడిగా వెంకటేష్ 1986 లో కె రాఘవేంద్రరావు దర్శకత్వం లో "కలియుగ పాండవులు", అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున సైతం 1986 లోనే వి మధుసూదనరావు దర్శకత్వం లో "విక్రం" సినిమాల ద్వారా విజయంతో పరిశ్రమలో అడుగు పెట్టారు.
నాగార్జున ఆ తరువాత మజ్ను, కిరాయిదాదా, మురళీకృష్ణుడు, జానకిరాముడు, ఆఖరిపోరాటం, విక్కీదాదా, గీతాంజలి వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినప్పటికీ "శివ " చిత్రం తో మాత్రమే అసలైన స్టార్ డం వచ్చింది. తెలుగు సినీ లోకంలో అగ్ర కథానాయకుడు అనే స్థాయి, హోదా స్థిరపడింది. అప్పటికే అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న చిరంజీవి, బాలకృష్ణ ల తరువాత రేంజ్ లో అభిమాన సమూహాన్ని తెచ్చి పెట్టింది. 22 సెంటర్స్ లో 100 రోజులు 5 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
Also read : భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ గా మార్చేసిన "మంగమ్మ గారి మనవడు" (1984)
తమిళ్ లో ఉదయం గా డబ్బింగ్ చేయబడి అక్కడ కూడా సంచలన విజయాన్ని సాధించింది. అంతకు ముందే మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన గీతాంజలి తమిళ్ లో కూడా సాధించిన విజయంతో గుర్తింపు తెచ్చుకున్న నాగార్జునకు శివ తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ను, ఫ్యాన్ బేస్ ను తీసుకు వచ్చింది. శివ విజయం తరువాత నాగార్జున ప్రతి సినిమా తమిళ్ డబ్బింగ్ చేయడం పరిపాటి అయింది. 1990 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోనే "శివ" ద్వారా హిందీ చిత్ర రంగ ప్రవేశం జరిగింది నాగార్జునకు. అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. నాగార్జున, వర్మలు బాలీవుడ్ లో సైతం తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నాంది పలికింది.
నాగార్జున తొలినాళ్ళ నుండి వినూత్న ప్రయోగాలకు ఆహ్వానం పలికేవారు. నూతన దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీ నటులకు తన సినిమాల ద్వారా అవకాశాలు కల్పించేవారు. అలా అవకాశం దక్కించుకొని టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ని సైతం తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఉర్రూతలూగించిన వారే రాంగోపాల్ వర్మ. విజయవాడ సిద్ధార్థ లో ఇంజనీరింగ్ చేసిన వర్మ తండ్రి అన్నపూర్ణ స్టూడియో లో సౌండ్ ఇంజనీర్ గా పని చేసేవారు. ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలు వెళదామనుకున్న వర్మ వీడియో పార్లర్ బిజినెస్ కి ఆకర్షితుడై అమీర్ పేట్ లో షాప్ ఆరంభించడం జరిగింది. ఆ సమయంలో విపరీతంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు చూడడం కారణంగా సినిమా ఫీల్డ్ వైపుకి ఆసక్తి మళ్ళింది.
అన్నపూర్ణ స్టూడియో తో ఉన్న అనుబంధం కారణంగా కలెక్టర్ గారి అబ్బాయి, రావుగారిల్లు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అప్రెంటిస్ షిప్ అవకాశం చిక్కింది. ఈ అనుభవం, అనుబంధంతో తన సిద్దార్థ కాలేజ్ రోజులు, కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రాసుకున్న శివ కథను ఎంతో ఆత్మవిశ్వాసంతో నాగార్జునకు వినిపించి, ఒకే అనిపించారు. నూతన దర్శకుడితో ఆ ప్రయోగం ఏదో తమ స్వంత అన్నపూర్ణ స్టూడియోలోనే చేద్దామని నిర్ణయించుకున్న అక్కినేని వెంకట్ "శివ" ఒక సేఫ్ ప్రాజెక్ట్ అయితే చాలు అనుకున్నారు.
"శివ" థియేటర్స్ లో విడుదల కావడమే తరువాయి కలెక్షన్స్ తో హోరెత్తించడమే కాకుండా..ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పటి వరకూ హీరో అంటే అదిరిపోయే ఇంట్రడక్షన్, దిక్కులు పిక్కటిల్లే పిచ్ తో పేజీల కొద్దీ డైలాగ్ లు, ఒళ్ళు హూనం అయ్యే డ్యాన్స్ లు, గాలిలో పల్టీలు కొట్టి చేసే ఫైట్ లు ఇలా కొన్ని ఆనవాయితీ అర్హతలు, అంచనాలు ఈ సినిమాలో గల్లంతయ్యాయి. విలన్ అంటే భారీ భయంకర ఆకారం, ముఖంలో నిరంతరం తాండవించే రౌద్రం అన్న నిర్దిష్ట నియమాలు కూడా కొట్టుకు పోయాయి. విలన్ రఘువరన్ కు భవానీ అనే మహిళా సంబోధిత పేరు పెట్టడం కూడా ఒక ప్రయోగమే.
Also read : నాటికీ, నేటికీ కృష్ణ " సింహాసనం " సినిమా ఒక చరిత్ర
హీరో, విలన్ పాత్రల చిత్రీకరణే కాదు శివ సినిమాలో ప్రతి అంశం సరికొత్త పంథాలో పయనించింది. ఒక కమర్షియల్ సినిమాలో సహజంగా చోటు చేసుకొనే హంగు, ఆర్భాటాలను తోసిరాజని వాస్తవికత కు దగ్గరగా చిత్రీకరించి కూడా పెద్ద సక్సెస్ ను సాధించవచ్చని నిరూపించింది. కాలేజ్ స్టూడెంట్స్, యువత మరీ ఎక్కువగా ఆదరించారు. నాగార్జున ఫుల్ హ్యాండ్స్ షర్ట్ స్లీవ్స్ పైకి మడత పెట్టిన డ్రెస్సింగ్ స్టైల్ టీనేజ్ ను వెర్రెత్తించింది. ఈ స్టైల్ దశాబ్దాలు కొనసాగింది. అదే విధంగా కాలేజ్ లో నాగార్జున సైకిల్ చైన్ లాగే ఫైట్ సన్నివేశం కూడా సినిమాకు ఒక హైలెట్.
జెడి చక్రవర్తి, చిన్న, బ్రహ్మాజీ, ఉత్తేజ్, రామ్ జగన్ వంటి వర్ధమాన నటులకు ఈ సినిమాతో మంచి గుర్తింపు, నట జీవితం సొంతమైంది. శివ కు ఇళయరాజామ్యూజిక్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యమైన సన్నివేశాలు, ఫైట్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అత్యున్నత స్థాయిలో నిలిపింది. "బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది" కాలేజ్ సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. "సరసాలు చాలు శ్రీవారు".."ఎన్నియల్లో ఎన్నియల్లో"..ఆనందో బ్రహ్మ" పాటలు కూడా సూపర్ హిట్ అయి అలరించాయి.
మొత్తంగా "శివ" నాగర్జున, రామ్ గోపాల్ వర్మ నట జీవితాలకే కాకుండా యావత్ భారత దేశ సినీ చరిత్రలోనే ఒక మాస్టర్ పీస్ గా నిలిచింది. అందుకే CNN - IBN ప్రకటించిన ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ 100 జాబితాలో చోటు దక్కించుకుంది. అలాగే ఫిల్మ్ ఫేర్ (19 90 ) ఉత్తమ తెలుగు చిత్రం గాను, నంది అవార్డ్స్ (19 90 ) ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ మాటల రచయిత ( తనికెళ్ళ భరణి ) మూడు సాధించింది. నాగార్జున, వర్మల "శివ" తాండవాన్ని ఆనాడు థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులు ఎంతైనా అదృష్టవంతులు.