29, నవంబర్ 2024, శుక్రవారం

తాళికట్టు శుభవేళ ..అంతులేని కథ ..ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గంధర్వ గాన విశ్వరూపం : Thali kattu subhavela song Lyrics - anthuleni katha - S. P. Balasubrahmanyam hit songs

చిత్రం : అంతులేని కథ (1976)

గానం : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం :ఆత్రేయ

సంగీతం : ఎం ఎస్ విశ్వనాథన్








పల్లవి:

తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల

వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను
కాకులు దూరని కారడవి
అందులో.. కాలం యెరుగని మానొకటి..
ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో..

చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా


తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో

చరణం 1:

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా
Singapore airlines announces the arrival of flight S2583

ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా
సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా


తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల

చరణం 2:

గోమాత లేగతో కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా
Wish you both a happy life… happy
 happy married life

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా
తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల

చరణం 3:

చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల



కోకిలమ్మ : పల్లవించవా నాగొంతులో..పల్లవి కావా నా పాటలో........

 

28, నవంబర్ 2024, గురువారం

పల్లవించవా నాగొంతులో..(కోకిలమ్మ) తెలుగు సినీ మధుర గీతాలు : pallavinchava naa gonthulo song ( Kokilamma ) Telugu Movie Melodies

చిత్రం : కోకిలమ్మ(1983)
సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం



                                                            


 

                                                                               

పల్లవి:

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

చరణం:
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

చరణం:
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

 

నాటికీ, నేటికీ కృష్ణ " సింహాసనం " సినిమా ఒక చరిత్ర : Simhasanam Movie Visual Wonder : Superstar Krishna


నాటికీ, నేటికీ కృష్ణ  " సింహాసనం " సినిమా ఒక చరిత్ర :  Simhasanam Movie Visual Wonder : Superstar Krishna



విడుదల : 21 మార్చ్  

నటవర్గం : కృష్ణ (ద్విపాత్రాభినయం), జయప్రద, రాధ, మందాకిని (తొలిపరిచయం) , కాంతారావు, సత్యనారాయణ, గుమ్మడి, అంజాద్ఖాన్ (తొలిపరిచయం), వహీదా రెహ్మన్, ప్రభాకరరెడ్డి , గిరిబాబు మొ,,

కథ, దర్శకత్వం, నిర్మాత : కృష్ణ

సంగీతం : బప్పీలహరి ( తొలిపరిచయం) 

గానం : రాజ్ సీతారం, పి. సుశీల 

ఛాయాగ్రహణం : కె  ఎస్ ఆర్ స్వామి 

నిర్మాణ సంస్థ : పద్మాలయా స్టూడియోస్  


                                    తెలుగు సినీ పరిశ్రమలో ధైర్య సాహసాలకు, అనితర సాధ్య ప్రయోగాలకు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త హంగులు, ఆదునిక పరిజ్ఞానం అయితేగానీ... నూతన నటీ నటులు, సాంకేతిక నిపుణులు అయితేగానీ పరిచయం చేయడం, ప్రోత్సహించడంలో కృష్ణ ముందు ఉండేవారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలలో నటించడం, నిర్మించడంలో నిరంతరం తలమునకలుగా ఉండేవారు. 


సినిమా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు ఆయన పేరు చెప్పుకొని భరోసాగా ఉండేవి. తన సినిమా వలన ఏ నిర్మాత అయినా నష్ట పోయాడు అని తెలిస్తే వెంటనే మరో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించి ఆదుకునేవారని పరిశ్రమలో బాహాటంగానే చెప్పుకునేవారు.  తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రం " గూడచారి 116", తొలి తెలుగు కౌబాయ్ చిత్రం " మోసగాళ్ళకు మోసగాడు ", తొలి తెలుగు  సినిమాస్కోప్ చిత్రం " అల్లూరి సీతారామరాజు" లలో నటించిన ఘనత ఆయన సొంతం. 


అదే విధంగా సినిమా బాల్కనీ టికెట్ 4,5 రూపాయలు ఉన్న కాలంలో 3 కోట్ల భారీ బడ్జట్ తో అత్యంత భారీ తారాగణం, భారీ సెట్టింగ్స్ ,  వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లు సినీ సాంకేతిక బృందాల సమాహారంతో " సింహాసనం" తొలి  తెలుగు 70 ఎం ఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్  చిత్రం  నిర్మించారు. కృష్ణ స్వీయ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేసారు. బాలీవుడ్ హీరోయిన్ మందాకిని,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజాద్ ఖాన్ లను తెలుగు తెరకు పరిచయం చేసారు. అదే విధంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరికి తొలి తెలుగు అవకాశం అందించారు. 

మహా మహుల నట విన్యాస పౌరాణిక చిత్ర రాజం "మాయాబజార్" :Telugu movie classic Old Mayabazar

కొన్ని అనివార్య కారణాల వలన తెలుగు గాయకుడిగా ఏకచ్చత్రదిపత్యంగా ఏలుతున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంని కాదని వర్ధమాన  గాయకుడు రాజ్ సీతారాం కు ఈ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా అవకాశం కల్పించడం అప్పట్లో పెను ప్రయోగం, పెను సంచలనమే. మళ్ళీ కృష్ణ - బాలసుబ్రహ్మణ్యంల మధ్య సయోధ్య కుదిరే వరకు రాజ్ సీతారాం కృష్ణ చిత్రాలకు ప్రత్యేక గాయకుడిగా పేరుపడ్డారు. సింహాసనం  ఘన విజయంలో పాటలు కూడా కీలక పాత్ర వహించాయని చెప్పొచ్చు.  " ఆకాశంలో ఒక తార "... "గుమ్మా గుమ్మా ముద్దుగుమ్మ "..."వహ్వా నీ యవ్వనం "..'ఇది కల అని నేననుకోనా".. "వయ్యారమంత ఇచ్చే కౌగిలి "  పాటలు ఆరోజుల్లోనే కాదు ఇప్పటి శ్రోతలను కూడా విశేషంగా అలరిస్తాయి. 


ఈ సినిమా స్థాయికి తగ్గట్టే పబ్లిసిటీలో కూడా భారీ తనాన్ని ప్రదర్శించారు. విజయవాడ, హైదరాబాద్ ఇతర పెద్ద నగరాలలో 100 అడుగుల కృష్ణ భారీ కటౌట్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఈ సినిమా విడుదలకు అభిమానులు, ప్రేక్షకులు వెల్లువలా విరుచుకుపడ్డారు. విజయవాడ రాజ్ 70 ఎం ఎం లో చూస్తేనే అసలు మజా అని ఏలూరు, తాడేపల్లి గూడెం , భీమవరం, కైకలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల నుండి అభిమానులు తరలి వెళ్ళారంటేనే అప్పట్లో "సింహాసనం" మరియు కృష్ణ ల క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 


85 ప్రింట్లతో దక్షిణాదిలోని 153 థియేటర్స్ లో విడుదల అయ్యి తొలి వారంలోనే కోటి యాభై లక్షల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మొత్తంగా నాలుగున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ తో రికార్డ్ నెలకొల్పింది. 6 కేంద్రాలలో ( హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ ) శతదినోత్సవం జరుపుకుంది. 

"సాహసం సేయరా డింభకా..తెలుగు సినీ అగ్రస్థానం లభించునురా" అని ఎన్ టి ఆర్ ని దీవించిన "పాతాళభైరవి" : NTR Patalabhairavi 


మద్రాస్ సముద్ర తీరంలోని విజిపి గార్డెన్స్ లో జరిగిన "సింహాసనం" శతదినోత్సవ వేడుకలకు వందలాది వాహనాల్లో తరలి వెళ్ళిన అశేష కృష్ణ అభిమాన జన సందోహాన్ని చూసి తమిళనాడు ప్రజలు ఆశ్చర్య పడ్డారు. ఈరోజు బాహుబలి తో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తం అయినా గానీ..సాంకేతికత, ఆర్ధిక వనరులు అంతంత మాత్రంగా ఉన్న ఆనాటి రోజుల్లో "సింహాసనం" చిత్ర నిర్మాణం  సాహసం..చరిత్రాత్మకం..చరితార్థం..!

25, నవంబర్ 2024, సోమవారం

మహా మహుల నట విన్యాస పౌరాణిక చిత్ర రాజం "మాయాబజార్" :Telugu movie classic Old Mayabazar

 

మహా మహుల నట విన్యాస పౌరాణిక చిత్ర రాజం "మాయాబజార్" :Telugu movie classic Old Mayabazar




విడుదల : 27 మార్చ్ 1957

నటవర్గం : ఎన్ టి ఆర్ , ఏ ఎన్ ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, గుమ్మడి,ముక్కామల, సి ఎస్ ఆర్, నాగభూషణం,               మిక్కిలినేని, ఛాయాదేవి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం, అల్లురామలింగయ్య, రమణారెడ్డి మొ..

దర్శకత్వం : కె వి రెడ్డి 

నిర్మాతలు : నాగిరెడ్డి, చక్రపాణి

సంగీతం : ఘంటసాల

ఛాయాగ్రహణం : మార్కస్ బార్ట్లీ 

నిర్మాణ సంస్థ : విజయా ప్రొడక్షన్స్

                                 

                              మహా మహుల నట విన్యాస పౌరాణిక చిత్ర రాజం "మాయాబజార్" 

                          తెలుగు చిత్రసీమలోనే కాకుండా యావత్ భారత దేశ చలనచిత్ర పరిశ్రమలలో నాటికీ, నేటికి మేటిగా నిలిచిన పౌరాణిక  చిత్ర రాజం మాయాబజార్. ఎందరో మహా నటులు, నటీమణుల సమ్మేళనం. ఎన్ టి రామారావు తొలిసారిగా కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా..అది మొదలు కృష్ణుడంటే ఎన్ టి ఆర్ తప్ప మరో నటుడిని ఆపాత్రలో ప్రేక్షకులు ఊహించుకోవడానికి కూడా  ఇష్టపడని పరిస్థితి కల్పించారు. ఒక్క కృష్ణుడు మాత్రమే కాదు రాముడు, భీముడు, శివుడు, దుర్యోధనుడు, రావణాసురుడు ఇలా ఏ ప్రధాన పౌరాణిక పాత్ర అయినా ఎన్ టి ఆర్ మాత్రమే పరిపూర్ణ న్యాయం చేయగలడు అన్న నిశ్చయానికి ప్రేక్షకులు వచ్చేశారు. అభిమన్యుడు - శశిరేఖ ల  పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రిల ముగ్ధ మనోహర అభినయం అదనపు ఆకర్షణ. ఇక ఘటోత్కచుడు గా ఎస్వీ రంగారావు తన నట విశ్వరూపమే ప్రదర్శించారు. ఈయనకు పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడు గా ఎంతటి పేరు వచ్చిందో..ఘటోత్కచుడు పాత్ర కూడా అదే స్థాయి గౌరవాన్ని తెచ్చింది.  


        తెలుగు సినీ ఆణిముత్యం " దేవదాసు " : All time telugu movie classics : Devadasu


సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లోనే పరిమిత వనరులతో అథ్భుతమైన కెమెరా పనితనం, కళాత్మక సెట్టింగ్స్ తోనూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. మరీ ముఖ్యంగా ఘటోత్కచుడు, అతని అనుచరులు  ప్రదర్శించే మాయలు, మంత్రాలు టక్కు టమార విద్యలు అబ్బురపరుస్తాయి. పెళ్లి విందు నేపథ్యంలో ఘటోత్కచుడు పై  వచ్చే " వివాహ భోజనంబు..వింతైన వంటకంబు" పాట సినిమాకే హైలైట్. ఈ తరం పిల్లలను కూడా ఈ పాట విశేషంగా అలరిస్తుండడం గొప్ప విషయమేగా..? ఈపాట నేటికీ సినిమాలకు, టివి సీరియళ్ళకు, హోటళ్ళు,  రెస్టారెంట్ తదితరాలకు పేరులుగా పెట్టుకోవడం, విందు, వినోదాలలో సందడి చేస్తుండడం సర్వ సాధారణంగా జరిగేదే..అదే విధంగా  "లాహిరి లాహిరి లాహిరిలో ".." చూపులు కలిసిన శుభవేళ "..."నీవేనా నను తలిచినది"..."అహనా పెళ్ళియంట"  పాటలు నేటికీ సినీ సంగీత ప్రియులకు వీనుల విందు చేస్తుంటాయి. 


"సాహసం సేయరా డింభకా..తెలుగు సినీ అగ్రస్థానం లభించునురా" అని ఎన్ టి ఆర్ ని దీవించిన "పాతాళభైరవి"



ప్రఖ్యాత విజయ ప్రొడక్షన్స్ పతాకంపై దిగ్ దర్శకుడు కె వి రెడ్డి దర్శకత్వంలో నాగిరెడ్డి, చక్రపాణినిర్మించిన ఈ మాయాబజార్ అఖండ విజయాన్ని సాధించి, అప్పట్లోనే 24 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. 2013 లో సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ జాతీయ ఇంగ్లీష్ న్యూస్ చానల్ ప్రకటించిన 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ ఆఫ్ ఆల్ టైం జాబితాలో "మాయాబజార్" కి స్థానం దక్కడం సముచితమే కదా..! మన తెలుగు ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే సినిమాలలో ఈ మాయాబజార్ ఎన్నటికీ ముందు వరుసలోనే ఉంటుంది.


17, నవంబర్ 2024, ఆదివారం

"సాహసం సేయరా డింభకా..తెలుగు సినీ అగ్రస్థానం లభించునురా" అని ఎన్ టి ఆర్ ని దీవించిన "పాతాళభైరవి" : NTR Patalabhairavi

 


"సాహసం సేయరా డింభకా.. ఎన్ టి ఆర్  "పాతాళభైరవి"



విడుదల : 15 మార్చ్ 1951

నటవర్గం : ఎన్ టి రామారావు, ఎస్ వి రంగారావు, రేలంగి, సి ఎస్ ఆర్, కె మాలతి, పద్మనాభం 

దర్శకత్వం : కె వి రెడ్డి 

నిర్మాతలు : నాగిరెడ్డి, చక్రపాణి 

సంగీతం : ఘంటసాల

నిర్మాణసంస్థ : విజయా ప్రొడక్షన్స్


                   తెలుగు సినీ చిత్ర సీమకు గర్వకారణంగా నిలిచే అతి కొద్ది సినీ  ఆణిముత్యాలలో "పాతాళభైరవి" మొదటి వరుసలో నిలుస్తుంది. కొన్ని వందల చిత్రాలకు ప్రేరణగా నిలిచిన, భవిష్యత్ లో మరెన్నో రానున్న తోటలో  రాముడు - కోటలో రాణి తరహా ప్రేమ కథల ఇతివృత్తానికి  ఊపిరి పోసిన చిత్ర రాజం. మహా నటులు ఎన్ టి ఆర్, ఎస్ వీ ఆర్ లకు తెలుగు చిత్ర లోకంలో మహా ప్రస్తనాలకు నాంది పలికింది. రాజకుమారిని దక్కించు కోవడం కోసం ఎంతటి సాహసానికైనా సిద్దపడే తోట రాముడి పాత్రలో ఎంతో ఎంతో చలాకీగా, అందంగా, వీరోచితంగా నటించి, జానపద కథానాయకుడు అంటే ఎన్ టి రామారావు అనే సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. " సాహసం సేయరా డింభక...సంకల్పం సిద్ధించునురా..రాజకుమారి లభించునురా" అన్న డైలాగులతో ఎస్ వీ రంగారావు రక్తి కట్టించిన నేపాళ మాంత్రికుడి పాత్ర, ఎన్నో మాయావి పాత్రలకు స్ఫూర్తిగా నిలవడమే కాకుండా,  ఎస్ వీ ఆర్ మహోన్నత నట జీవితానికి బాటలు వేసింది. 


అప్పటికే ఎన్ టి ఆర్ మనదేశం, షావుకారు, పల్లెటూరి పిల్ల వంటి కొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించినప్పటికీ పాతాళభైరవి సాధించిన అథ్భుతమైన విజయంతో  జానపద కథానాయకుడిగా పాపులర్ అయి ఎన్నో సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నారు. "కలవరమాయే మదిలో..నా మదిలో " ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు " " వినవే బాల నా ప్రేమగోల " పాటలు నేటికీ సినీ సంగీత జగత్తులో దృవతారలు.  200 రోజులు ప్రదర్శించబడిన తొలి తెలుగు సినిమా గా రికార్డ్ సృష్టించింది. 


మొట్ట మొదటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన ఏకైక దక్షిణాది చిత్రంగా ఘనత దక్కించుకుంది. CNN - IBN ఇంగ్లీష్ న్యూస్ చానెల్ 2013 లో ప్రకటించిన భారతదేశ ప్రసిద్ద 100 చిత్రాల జాబితాలో స్థానం పొందడం ద్వారా తన విశిష్టతను ఘనంగా చాటుకుంది. పాతాళభైరవి మొదటిసారి థియేటర్ లో విడుదలైనప్పుడు చూసిన ప్రేక్షకులు బహు అరుదు అయినప్పటికీ..రీ రిలీజ్ లో చూసిన వారు చాలామంది ఉంటారు. అలాంటి ప్రేక్షకులు గానీ, ఆనాటి ప్రేక్షకులు చెప్పిన నాటి సినిమా విశేషాలు గానీ మీకు గుర్తుంటే కామెంట్స్ రూపంలో అందరితో పంచుకోండి.

12, నవంబర్ 2024, మంగళవారం

తెలుగు సినీ ఆణిముత్యం " దేవదాసు " : All time telugu movie classics : Devadasu

తెలుగు సినీ ఆణిముత్యం " దేవదాసు " : All time telugu movie classics : Devadasu




విడుదల : 26 జూన్ 1953

నట వర్గం : అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, సి ఎస్ ఆర్ ఆంజనేయులు, పేకేటి శివరాం 

దర్శకత్వం : వేదాంతం రాఘవయ్య 

నిర్మాత : డి ఎల్ నారాయణ 

నిర్మాణ సంస్థ : వినోదా పిక్చర్స్ 

సంగీతం : సి ఆర్ సుబ్బరామన్ 

ఛాయాగ్రహణం : బి ఎస్ రంగ


తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాలలో మేటి "దేవదాసు". సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ నవల దేవదాసు దీనికి ఆధారం. దేవదాసు, పార్వతిల పాత్రలకు ప్రాణం పోసారు అక్కినేని, సావిత్రిల జంట. నాటికి, నేటికి భగ్న ప్రేమికుల కథ అంటే దేవదాసునే ముందుగా గుర్తుకు వచ్చే ఉన్నత స్థాయిలో సినిమాకు జీవం పోసారు దర్శకుడు వేదాంతం రాఘవయ్య. 


సినిమా అపూర్వ విజయానికి దేవదాసు, పార్వతిల పాత్రలలో ఎ ఎన్ ఆర్, సావిత్రిల నటన ఎంతగా దోహదం చేసిందో..అంతే స్థాయిలో పాటలు కూడా తోడ్పడ్డాయి. "అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా?"..."జగమే మాయ, బ్రతుకే మాయ"..."పల్లెకు పోదాం, పారును చూద్దాం చలో చలో".."కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్"..." ఓ ఓ దేవాదా, ఓ ఓ పార్వతి " .." తానే మారేనా, గుణమ్మేమారేనా "..."కల ఇదని, నిజమిదని"లాంటి పాటలు ఘంటసాల, బాలసరస్వతి, జమునారాణి, జిక్కి ల గానంతో తెలుగు   సినీ గీత జగత్తులో నేటికీ  అజరామరంగా వెలుగుతూనే ఉన్నాయి. 


అప్పటికే సినిమా రంగంలోకి ప్రవేశించి దశాబ్ద కాలం దాటిన అక్కినేని  నట జీవితంలో శ్రీ సీతా రామ జననం, బాలరాజు, కీలు గుర్రం, లైలా మజ్ను, పల్లెటూరి పిల్ల వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నప్పటికీ దేవదాసు అందించిన ఘన విజయం ఒక గొప్ప మలుపు, చరిత్రగా లిఖించబడింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకే ఒక గొప్ప మలుపు, గెలుపుని ఇచ్చింది దేవదాసు. తెలుగు సినిమా దేవదాసుకు ముందు, దేవదాసుకు తరువాత అని చెప్పుకునేలా గతిని మార్చేసింది. అక్కినేని అప్పటికే జానపద, పౌరాణిక పాత్రలు ఎన్నో పోషించి విజయాలు సొంతం చేసుకున్నప్పటికీ ఈ దేవదాసు అక్కినేనిని పూర్తి స్థాయిలో సాంఘిక చిత్ర కథానాయకుడిగా స్థిరపరిచింది అని చెప్పొచ్చు. నాడు మొదలైన ఎ ఎన్నార్, సావిత్రిల హిట్ పెయిర్ ఎన్నో విజయవంతమైన చిత్రాల బంధంగా కొనసాగింది. 


దేవదాసు పాత్రలో నటనే కాదు ఆ పాత్రకు తగ్గ ఆహార్యాన్ని మలచుకోవడానికి అక్కినేని పడిన తపన, కష్టం నటీ నటులకు ఒక సిలబస్ గా మారింది. ముఖం పీక్కుపోయినట్టు, కళ్ళు లోపలికి పోయినట్టు కనిపించడం కోసం ఎన్నో రాత్రిళ్ళు నిద్రపోకుండా ఉండే వారంట..తనపై సీన్ లు కూడా రాత్రి సమయంలో ఎక్కువ ఉండేటట్లు షూటింగ్ ప్లాన్ చేయించే వారు. ఆ శ్రమ, ఆ అంకిత భావమే అపురూప విజయాన్ని అందించింది. 


తెలుగు చిత్ర సీమలో ఒక ఉన్నత స్థానాన్ని సాధించి పెట్టింది.  తాగుబోతు పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించాలంటే అది అక్కినేని తరువాతే ఎవరైనా అన్న పరిస్థితి వచ్చింది. ఒక్క తెలుగు, దక్షిణాది భాషా చిత్రాలలోనే కాదు యావత్ భారత దేశ సినీ రంగంలోనే అటువంటి పాత్రకు రోల్ మోడల్ గా నిలిచారు. హీరోగా తొలి దశలో దేవదాసు, మధ్యలో ప్రేమ నగర్, మలి దశలో ప్రేమాభిషేకం ..భగ్న ప్రేమికుడు, మద్యానికి బానిస అయిన హీరో చిత్రాలే. ఇండస్ట్రీ హిట్ లే . అటువంటి పాత్రలకు అక్కినేని తప్ప మరెవరూ దైర్యంగా ముందుకు రాకుండా చేసాయి. చేసినా తగిన విజయాలను, గుర్తింపును పొందలేక పోయాయి. 


అలనాటి సినీ ఆణిముత్యాలను అప్పటి సినిమా హాళ్ళలో చూసిన అదృష్టవంతులు ఆ మధురానుభూతులను ఆనందంగా వర్ణిస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా..? మీ కుటుంబంలో గానీ, బంధువర్గంలో గానీ ఇలాంటి విశేషాలు విని ఉంటే కామెంట్ చేయండి..!