తెలుగు సినీ హీరోలలో అందగాడు అనగానే ముందుగా గుర్తొచ్చేది శోభన్ బాబు ( Sobhan Babu)
తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన హీరోలలో శోభన్ బాబు ( Sobhan Babu ) ఒకరు. ఆయన అందం, అభినయం, ఆహార్యం.. అన్నీ కలగలిపి ఒక ప్రత్యేకమైన శోభన్ బాబు బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించాయి. తెలుగు సినిమా తొలితరం ప్రభావవంతం అయిన అగ్ర కథానాయకులలో ఒకరిగా ఆయన వెలుగొందారు. ఆయన తెరపై కనిపించారంటే చాలు, ప్రేక్షకులు పరవశించిపోయేవారు.
ఒక తరం ప్రేక్షకులు మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల కథానాయకుడు..నవలా నాయకుడు.. శోభన్ బాబు. అప్పట్లో శోభన్ బాబు మహిళా అభిమాని లేని తెలుగు సినీ ప్రేక్షక కుటుంబం లేదంటే అతిశయోక్తి కాబోదు. అటువంటి అతివల హృదయ విజేత శోభన్ బాబు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం.
గ్లామర్ హీరో కి అసలైన బ్రాండ్ నేం శోభన్ బాబు
శోభన్ బాబు అంటేనే అందం. ఆయన కళ్ళు, ముక్కు, చిరునవ్వు.. అన్నీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉండేవి. ఆయన తెరపై కనిపిస్తే చాలు, ప్రేక్షకులు మైమరచిపోయేవారు. ఆయన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. "అందగాడు అంటే శోభన్ బాబు లాగా ఉండాలి" అని అనేవారు. ఇన్ షర్ట్ డ్రెస్సింగ్ స్టైల్, వంకీ తిరిగిన హెయిర్ స్టైల్ తో అప్పట్లో గ్లామర్ హీరో కి ఒక ట్రెండ్ సెట్ చేసిన నేచురల్ హీరో.
ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరో సినిమాలకు కూడా ఆయనే ట్రెండ్ సెట్టర్. మగవాళ్ళు కొంచెం స్టైల్ గా తయారైతే " ఏరోయ్..శోభన్ బాబులా రెడీ అయిపోయావ్..ఏమిటి సంగతి..?" అని సెటైర్ లు వేసే వాళ్ళు. ఒక విధమైన వేగంతో, రొమాంటిక్ డైలాగ్ డెలివరి తో మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల కథానాయకుడు.
చదువుకునే రోజుల నుండే నటనపై ఆసక్తి
1937 జనవరి 14 న కృష్ణా జిల్లా చిన నందిగామ లోని సామాన్య రైతు కుటుంబంలో శోభన్ బాబు జన్మించారు. అసలు పేరు ఉప్పు శోభనాచలపతిరావు. మైలవరంలో హైస్కులు చదివే రోజుల్లోనే నటనపై ఆసక్తితో ఎన్నో నాటక ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఈ అభిరుచి గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కాలేజీలో డిగ్రీ చదివేనాటికి మరింతగా విస్తృతమైంది.
తదనంతరం మద్రాసు లో లా విద్య అభ్యసిస్తూనే మరోపక్క నటనపై మక్కువతో సినిమా అవకాశాల కోసం స్టూడియోలు, నిర్మాణ సంస్థల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అవిశ్రాంత పరిశ్రమ చేసేవారు. అప్పటికే శాంతకుమారి తో వివాహం జరిగింది.
విభిన్న పాత్రల్లో మెప్పించిన నటుడు
ఎన్నో ప్రయత్నాల అనంతరం 'భక్త శబరి' చిత్రంలో తొలిగా అవకాశం వచ్చినప్పటికీ ముందుగా విడుదల అయిన చిత్రం మాత్రం NTR హీరోగా నటించిన 'దైవబలం' ( 1959). ఇందులో ముని కుమారుడు పాత్రలో నటించారు. తనకు వచ్చిన పాత్ర పరిది పెద్దదా, చిన్నదా అన్నది పరిగణన లోనికి తీసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని తానేమిటి అన్నది నిరూపించుకోవడానికి వినియోగించుకున్నారు.
సినీ ప్రస్థానం తొలినాళ్ళలో అప్పటికే అగ్ర కథానాయకుడు గా నీరాజనాలు అందుకుంటున్న NTR తో అనేక చిత్రాలలో కలిసి నటించే అవకాశం దక్కింది. ఆయనతో కలిసి ఎన్నో విజయవంతమైన పౌరాణిక చిత్రాలలో నటించి పేరు గడించారు. నాటి మరో అగ్ర కథానాయకుడు ANR తో కలిసి చదువుకున్న అమ్మాయిలు (1963), పూలరంగడు (1967),బుద్ధిమంతుడు (1969), కన్నతల్లి (1972) తదితర సాంఘిక చిత్రాలలో గుర్తింపు పొందిన పాత్రలు పోషించారు.
వీరాభిమన్యు (1965) లో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఆ తరువాత హాస్య నటుడు పద్మనాభం హీరోగా చేసిన పొట్టి ప్లీడర్ (1966), శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967) చిత్రాలలో కూడా తక్కువ ప్రాధాన్యత గల పాత్రలలో నటించారు. సినీ పరిశ్రమలో ఒక పదిలమైన స్థానం కోసం ఆయన చేసిన అవిరళ కృషికి ఇది నిదర్శనం.
శోభన్ బాబు కేవలం అందగాడే కాదు, మంచి నటుడు కూడా. ఆయన విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. పౌరాణిక చిత్రాలలో ఆయన రాముడిగా, కృష్ణుడిగా, లక్ష్మణుడిగా, అర్జునుడిగా, అభిమన్యుడుగా ఇలా ఎన్నో పాత్రలలో జీవించారు. సీతారామ కళ్యాణం, భీష్మ, మహామంత్రి తిమ్మరుసు, లవకుశ, నర్తనశాల, శ్రీ కృష్ణ పాండవీయం, కృష్ణార్జునులు, సంపూర్ణ రామాయణం వంటి చిత్రాలు ఆయన నటనా కౌశల్యానికి నిదర్శనం.
అలాగే మానవుడు దానవుడు, జీవన తరంగాలు, శారద, మైనర్ బాబు, డాక్టర్ బాబు, ఖైదీబాబాయ్, చక్రవాకం,మంచిమనుషులు, బాబు, జీవనజ్యోతి, సోగ్గాడు, మల్లెపువ్వు, కార్తీకదీపం, గోరింటాకు, మోసగాడు, స్వయంవరం, దేవత, ముందడుగు, ఇద్దరు దొంగలు, ఇల్లాలు ప్రియురాలు, దేవాలయం తదితర సాంఘిక చిత్రాలలో ఆయన తనదైన సహజ శైలిలో నటించి మెప్పించారు.
సాంఘిక చిత్రాలలో ఆయన ఒక సాధారణ వ్యక్తిగా, అనురాగ మూర్తి భర్తగా, బాధ్యతగల కొడుకుగా, సోదరుడుగా, ఒక అద్భుత ప్రేమికుడిగా, ఒక తండ్రిగా ఇలా విలక్షణమైన ఎన్నో పాత్రలకు జీవం పోసి ప్రేక్షక హృదయాలలో చెరిగిపోని ముద్ర వేసారు.
శోభన్ బాబు విలక్షణ వ్యక్తిత్వం
శోభన్ బాబు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆదర్శవంతమైనది. ఆయన భార్య పేరు నిర్మల. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శోభన్ బాబు ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండేవారు. సినిమా రంగంలో ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. ఆయన సహనానికి, నిరాడంబరతకు ఎందరో అభిమానులు ఉన్నారు.
ఎంతో ఆకర్షణ, మరెంతో విలాసాలకి ఆలవాలమైన సినీ రంగంలో ఉన్నప్పటికీ ఎంతో క్రమశిక్షణతో, వివాదరహితుడిగా నిలిచారు. అలనాటి అందాల కథానాయకురాలు, ఒకనాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ముడిపెట్టి న పుకార్లు తప్ప మరి ఏ ఆక్షేపణలు, ఆరోపణలు లేనట్టి వ్యక్తిత్వం.
కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుచేతనో వారిని సినీ పరిశ్రమకు పూర్తి దూరంగా ఉంచారు. తన తోటి అగ్ర కథానాయకులు NTR, ANR, కృష్ణ లు వారి వారసుల్ని, బంధువులను సినిమా పరిశ్రమ వైపు ప్రోత్సహించినప్పటికీ శోభన్ బాబు మాత్రం తన కుమారుడిని గాని, ఇతర తన వారిని గాని వెండితెరకు పరిచయం చేయడానికి అసలు ఇష్టపడలేదు.
తన నటనా వైదుష్యంతో వరించిన " నట భూషణ " ( Nata Bhushana) బిరుదుకు సార్ధకత తెచ్చారు. దక్షిణాది ఫిలిం ఫేర్ నాలుగు ఉత్తమ నటుడు అవార్డ్ లు స్వీకరించారు. ఎటువంటి భేషజం లేకుండా తెలుగు హీరోలలో ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలలో నటించిన శోభన్ బాబు "మహాసంగ్రామం " ( 1985) చిత్రం మిగిల్చిన చేదు అనుభవంతో ఆ తరహా చిత్రాలకు స్వస్తి పలికారు.
Also Read : కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య "మహా సంగ్రామం" (1985) : Krishna, Sobhan babu Last Multi Starrer Telugu Movie "Maha Sangramam"
నాటి సమవుజ్జీలు అయిన కృష్ణ, శోభన్ బాబు లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండడం, శోభన్ బాబు పాత్రను కుదించడం ఆయన అభిమానులను తీవ్రంగా బాధించింది. ఇది చాలా చోట్ల ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలకు సైతం దారి తీసింది. ఈ విషయం శోభన్ బాబు దృష్టికి వచ్చి, ఇకపై మల్టీ స్టారర్ సినిమాలలో నటించను అని ఆయన పత్రికా ముఖంగా ప్రకటించే వరకు వచ్చింది.
ఆ మాటకు అనుగుణంగానే నట జీవితం మలి దశలో కూడా సర్పయాగం, బలరామకృష్ణులు, ఏవండీ ఆవిడ వచ్చింది, జీవిత ఖైదీ, ఆస్తిమూరెడు ఆశ బారెడు, దొరబాబు, అడవిదొర తదితర చిత్రాలలో హీరో, ప్రధాన పాత్రలలో నటించారు. ఆఖరి చిత్రం "హలో గురు" ( 1996) లో హీరోగానే నటించి తన సుదీర్ఘ నట జీవితానికి తెర దించారు.
అత్యంత స్నేహశీలి, స్ఫూర్తి ప్రదాత
శోభన్ బాబు స్నేహానికి ఎంతో విలువ, ప్రాధాన్యత ఇచ్చేవారు. కె వి చలం, మురళీమోహన్, చంద్రమోహన్ లకు ఆప్త మిత్రులు. కష్టపడి స్వయంగా ఎదిగిన నేపథ్యం కావడం వలన ఆయన ఎంతో ఆర్ధిక క్రమశిక్షణ కలిగి ఉండేవారు. అదే తన మిత్రులకు, పరిచయస్తులకు సూచనలు, సలహాలుగా ఇచ్చేవారు. వచ్చే సంపాదనలో ఎంతో కొంత భూమి కొనుగోలు కు కేటాయించాలని, రేపు అదే భవిష్యత్ కు భరోసాగా ఉంటుందని గట్టిగా చెప్పేవారు.
జయభేరి ఆర్ట్స్, జయభేరి రియల్ ఎస్టేట్ తోపాటుగా మరిన్ని వ్యాపార సంస్థల అధిపతి అయిన సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీమోహన్ తన ఉన్నతికి శోభన్ బాబు ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణం అని ఎన్నో సందర్భాలలో చెప్పారు.
శోభన్ బాబు మరణం
శోభన్ బాబు మరణం తెలుగు సినిమాకు తీరని లోటు. ఆయన 2008 మార్చి 21న గుండెపోటుతో మద్రాసు లోని తన స్వగృహంలో మరణించారు. ఆయన లేకపోవడం నిజంగా బాధాకరం. అశేష తెలుగు మహిళా ప్రేక్షకులను శోకసముద్రంలో ముంచి ఆయన తన జీవన ప్రస్థానాన్ని ముగించారు. కానీ, ఆయన తను చేసిన సినిమాల ద్వారా, ఆయన పోషించిన విభిన్న పాత్రల ద్వారా ఎప్పటికీ మన హృదయాలలో జీవించే ఉంటారు.
శోభన్ బాబు జ్ఞాపకాలు
శోభన్ బాబు గురించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన సినిమాలు చూసినప్పుడు, ఆయన పాటలు విన్నప్పుడు ఆయన మనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన నటన, ఆయన వ్యక్తిత్వం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ ఉంటాయి.
శోభన్ బాబు ఒక నటుడు మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆయన సినిమాలను చూస్తూ, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుందాం.
ఇవండి నట భూషణ శోభన్ బాబు గురించి కొన్ని విశేషాలు. మీకు కూడా ఆయన గురించి ఏమైనా విశేషాలు తెలిస్తే, కామెంట్స్ లో చెప్పండి. మనం ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
చిరంజీవిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జీవిత "ఖైదీ" ని చేసిన చిత్రం
భార్గవ్ ఆర్ట్స్ అంటే బాలకృష్ణ గా మార్చేసిన "మంగమ్మ గారి మనవడు" (1984)
నాటికీ, నేటికీ కృష్ణ " సింహాసనం " సినిమా ఒక చరిత్ర